రాజయోగం
పంటల్లో ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతులు పాటిస్తే రాజయోగమే అని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : పంటల్లో ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతులు పాటిస్తే రాజయోగమే అని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు అన్ని పంటలు బెట్ట పరిస్థితుల నుంచి గట్టెక్కినందున వాటిని కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ప్రస్తుతం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.
వేరుశనగ : జూన్‌లో వేసిన వేరుశనగ ఊడలు నుంచి కాయ తయారయ్యే దశలో ఉంది. తర్వాత వేసిన పంట పూత, ఊడల దశలో ఉంది. కాయ తయారయ్యే దశలో ఉన్న పంటలో ఎలాంటి అంతర సేద్యం చేయకూడదు. కాయలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. పూత దశలో ఉన్న వాటిలో అంతర సేద్యం చేసిన తర్వాత ఎకరాకు 200 కిలోలు జిప్పం వేసుకుంటే మేలు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని సవరించుకునేందుకు ఎకరాకు అరకిలో ఫార్ములా–4 పిచికారీ చేసుకోవాలి. దీని వల్ల పూత, కాయలు బాగా వస్తాయి. వర్షం ఎక్కువగా కురిసిన ప్రాంతాల్లో ఆకుమచ్చతెగులు, వేరుకుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాంటి లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 400 మి.లీ హెక్సాకొనజోల్ పిచికారీ చేసుకోవాలి. నల్లజీడ, ఆకుముడుత బాగా తగ్గిపోయింది. పచ్చపురుగు వచ్చే అవకాశం ఉన్నందున నివారణకు ఎకరాకు 400 మి.లీ క్వినాల్‌ఫాస్ పిచికారీ చేసుకోవాలి.
కంది : వేరుశనగ, సజ్జ, కొర్రలో అంతర పంటగానూ మరికొన్ని చోట్ల ఏకపంటగా కంది వేశారు. తేమ ఎక్కువైతై మొక్కలు చనిపోతాయి. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాళ్ల మధ్యలో తల్లిచాలు (గొడ్డుచాలు) మడక ద్వారా ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో త్వరగా బెట్టకు గురికాకుండా కాపాడుకోవచ్చు. కంది మొక్కలు ఒత్తుగా లేకుండా కనీసం జానెడుకు ఓ మొక్క ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం ఎకరాకు 10 కిలోల యూరియా పైపాటుగా వేసుకుంటే మేలు. తర్వాత చీడపీడలు, పురుగులు వ్యాపించకుండా ఎకరాకు 250 మి.లీ క్వినాల్‌పాస్ + అర్ధ లీటర్ వేపనూనె పిచికారీ చేసుకోవాలి.
పత్తి : పత్తి పొలంలో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వర్షం ఎక్కువైన ప్రాంతాల్లో ఆకుమచ్చతెగులు, వేరు, కాండంకుళ్లు సోకే అవకాశం ఉంది. ఎకరాకు 600 గ్రాములు కాపర్‌ఆక్సీక్లోరైడ్ లేదా 500 గ్రాములు మాంకోజెబ్ లేదా 200 మి.లీ ప్రొపికొనజోల్ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎకరాకు 25 కిలోల యూరియా వేసుకుంటే బాగుంటుంది.
ఆముదం : ఎకరాకు 20 కిలోల యూరియా వేసుకోవాలి. అలాగే ఎకరాకు 500 మి.లీ క్వినాల్‌ఫాస్ + ఒక లీటర్ వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు తెగులుతో మొక్కలు చనిపోతున్నట్లు గమనిస్తే ఎకరాకు 500 గ్రాములు మాంకోజెబ్ పిచికారీ చేయాలి.
పెసర, మినుము : ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉన్నందున ఎకరాకు 500 మి.లీ హెక్సాకొనజోల్ పిచికారీ చేయాలి. అలాగే పల్లాకు తెగులు రాకుండా ఎకరాకు ఒక లీటర్ వేపనూనె పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎకరాకు 10 కిలోల యూరియా వేసుకోవాలి.


