మహిళా రైతులే ప్రగతి సారథులు ! | Women farmers are the torchbearers of progress | Sakshi
Sakshi News home page

మహిళా రైతులే ప్రగతి సారథులు !

Oct 15 2026 12:24 AM | Updated on Oct 15 2026 12:24 AM

Women farmers are the torchbearers of progress

మన దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్‌ భారత్‌) అవతరించాలన్న లక్ష్యం నెరవేరాలంటే గ్రామీణ భారతం ఆర్థికంగా, సామాజికంగా పరిపుష్టం కావాలి. గ్రామీణాభివృద్ధికి, ఆధునిక వ్యవసాయ వికాసానికి మహిళా రైతులే మూలస్తంభాలు. ఈ వాస్తవాన్ని చాటిచెబుతూ హైదరాబాద్‌లోని ‘ఐసీఏఆర్‌–మేనేజ్‌’ సంస్థ అక్టోబర్‌ 15న ‘మహి ళా కిసాన్‌ దివస్‌’ వేడుకలను నిర్వహిస్తోంది. మహిళలను రైతులుగా గుర్తించటంతో పాటు భూమి, సాంకేతికత, రుణాలు, విస్తరణ సేవ లు, మార్కెట్లు, నిర్ణయాధికారాల్లో వారి భాగస్వామ్యంపై దృష్టి సా రించటానికి ఈ దినోత్సవం ఒక ముఖ్యమైన వేదికగా మారింది. 

మన వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కేవలం శ్రామికులు గా మాత్రమే పరిమితం కాలేదు. వారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారారు. గ్రామీణ మహిళల్లో దాదాపు 80 శాతం మం ది వ్యవసాయ కూలీలుగాను, స్వయం ఉపాధి పొందే రైతులుగాను పాలుపంచుకుంటున్నారని భారత ప్రభుత్వ తాజా గణాంకాలు చెబుతున్నాయి. 9 రాష్ట్రాల్లో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్‌) చేసిన అధ్యయనం ప్రకారం... ప్రధాన పంటల ఉత్పత్తి పనుల్లో 75 శాతం, ఉద్యానవన పంటల్లో 79 శాతం, కోత అనంతర ప్రాసెసింగ్‌ పనుల్లో 51 శాతం, పశుపోషణ–మత్స్య రంగాల్లో ఏకంగా 95 శాతం భాగస్వామ్యం మహిళలదేనని తేలింది. ఈ గణాంకాలు చాటి చెబుతున్నదేమంటే... భారతీయ వ్యవసాయానికి మహిళలు కేంద్ర బిందువుగా ఉన్నారు.  

విత్తనం ఎంపిక చేయటం నుంచి విత్తటం, కలుపు తీయటం, పంట కోత, పంట నిల్వ, విలువ జోడింపు, మార్కెటింగ్‌ దాకా ప్రతి దశలోనూ వారి శ్రమ దాగి వుంది. దేశవ్యాప్తంగా 1,175 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (డబ్ల్యూఎఫ్‌పీఓలు) దాదాపు 23.55 లక్షల మంది సభ్యులతో విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అంతేకాదు ‘కృషి సఖి’, ‘నమో డ్రోన్‌ దీదీ’ వంటి సరికొత్త ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామీణ మహిళలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తున్నాయి.   

ఉత్పాదక ఆస్తులపై హక్కులు దక్కాలి
అయితే, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇప్పటికీ తక్కువేమీ కావు. భూమి యాజమాన్య హక్కులు, తక్కువ వడ్డీ రుణాల లభ్యత, వ్యవసాయ యంత్రాల నిర్వహణ, లాభదాయకమైన మార్కెట్ల అందుబాటు వంటి విషయాల్లో లింగ వివక్ష ఇంకా కొనసాగుతోంది. దీంతోపాటు ఇంటి బాధ్యతలు, పోషణ భారం మహిళలపైనే ఎక్కువగా పడుతోంది. అందుకే, కేవలం సంక్షేమ పథకాల్లో మహిళల సంఖ్యను పెంచటం మాత్రమే సరిపోదు. వారికి ఉత్పాదక ఆస్తులపై యాజమాన్య హక్కులు దక్కాలి. ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాధికారం లభించాలి. వ్యవసాయ విధాన రూపకల్పనలోనూ వారి గళం ప్రతిబింబించినప్పుడే సమగ్ర సాధికారత సాధ్యమవుతుంది.   

ఈ దిశగా‘మేనేజ్‌’ ఈ నెల 15న 12 రాష్ట్రాల నుంచి 171     మంది మహిళా రైతులను ఆహ్వానించి, వారిని గౌరవించనుంది. తమ ఆకాంక్షలను, వాస్తవ అనుభవాలను మహిళా కిసాన్‌ గోష్టిలో వెల్లడిస్తారు. వ్యవసాయాన్ని కేవలం ఒక వృత్తిగానే కాకుండా ఒక గుర్తింపుగా, జీవనోపాధిగా, ఆకాంక్షల మార్గంగా చర్చించడానికి ఇది అవకాశం ఇస్తుంది. వ్యవసాయ రంగంలో ప్రతి నూతన సాంకేతికత, ప్రతి ఆర్థిక విధానం మహిళల స్థితిగతులను మెరుగుపరిచేలా ఉన్నప్పుడే సమాజం ముందడుగు వేస్తుంది.  

-డా. వినీతా కుమారి
-వ్యాసకర్త డిప్యూటీ డైరెక్టర్‌ (జెండర్‌ స్టడీస్‌),నేషనల్‌ ఇన్స్‌స్టిట్యూట్  ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (నేడు మహిళా కిసాన్‌ దివస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement