గాజువాక గణేశునికి 12.5 టన్నుల లడ్డూ | 12.5 tons of laddu for GAJUWAKA ganes | Sakshi
Sakshi News home page

గాజువాక గణేశునికి 12.5 టన్నుల లడ్డూ

Aug 26 2016 7:10 PM | Updated on Sep 4 2017 11:01 AM

వినాయక చవితి వేడుకలకు భారీలడ్డూల తయారీలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం మరో మహా లడ్డూ తయారీకి వేదిక కానుంది.

వినాయక చవితి వేడుకలకు భారీలడ్డూల తయారీలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం మరో మహా లడ్డూ తయారీకి వేదిక కానుంది. ఖైరతాబాద్ గణనాథునికి భారీలడ్డూలను సమర్పించడంలో ఖ్యాతిగాంచిన సురుచి ఫుడ్స్ సంస్థ 12.5 టన్నుల మహాలడ్డూతో సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.

 

శుక్రవారం తాపేశ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని అంబాల పట్టణంలో అరసూరి అంబాజిమాత దేవస్థానం ట్రస్టు తయారుచేసిన 11,115 కిలోల లడ్డూ ఇప్పటి వరకు గిన్నీస్ రికార్డుగా ఉందన్నారు. ఇప్పుడు ఈ రికార్డును తాము అధిగమించనున్నట్టు తెలిపారు. 12,500 కిలోల మహాలడ్డూను తయారుచేసి విశాఖ గాజువాకలో ఏర్పాటుచేస్తున్న దేశంలో కెల్లా అతిపెద్ద మహాగణపతికి బహూకరిస్తామన్నారు. గణేష్ మహాలడ్డూ తయారీలో గిన్నీస్ రికార్డు స్థాపించమని గతం నుంచి తనపై అనేక ఒత్తిడులు ఉన్నా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నియమాలకు కట్టుబడి ఆ ప్రయత్నం చేయలేదన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూ మాత్రమే పంపిస్తున్నామని, గిన్నీస్ రికార్డు మన రాష్ట్రంలోనే చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. 12.5 టన్నుల లడ్డూ తయారీకి సుమారు రూ.30 లక్షలు వ్యయమవుతుందని, ఆ మొత్తాన్ని బంధువులు, మిత్రుల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నానని చెప్పారు.

 

లడ్డూ తయారీలో 2,400 కిలోల నెయ్యి, 600 కిలోల నూనె, 3,350 కిలోల శనగపిండి, 4,950 కిలోల పంచదార, 400 కిలోల జీడిపప్పు, 200 కిలోల బాదంపప్పు, 125 కిలోల యూలకులు, 30 కిలోల పచ్చకర్పూరం వినియోగించనున్నట్టు తెలిపారు. ఈనెల 28న సురుచి ఆవరణలో ఏర్పాటు చేసిన మహాలడ్డూ తయారీ ప్రాంగణంలో గణనాథుని ప్రతిష్ఠించి తనతో పాటు 20 మంది సురుచి సిబ్బంది గణేష్‌మాలలు ధరించి లడ్డూ తయారీ దినుసులు సిద్ధం చేసుకుంటామన్నారు. సెప్టెంబరు 2న తయారీ ప్రారంభిస్తామని, 3న లడ్డూను అలంకరిస్తామని, 4న సాయంత్రం భారీ క్రేన్ల సాయంతో ప్రత్యేక వాహనంలో గాజువాక తరలిస్తామని వివరించారు. గతంలో మాదిరి హైదరాబాద్ చేపల బజార్ గణేశునికి 100 కిలోలు, జిల్లాలో ప్రసిద్ధి చెందిన అయినవిల్లి, బిక్కవోలు, రామచంద్రపురంలోని దఫేదార్ గణేశులకు 50 కిలోల లడ్డూలను, కాకినాడ గణపతికి 25 కిలోల లడ్డూను కానుకగా అందజేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement