
అవసరమైన వస్తువులు కొనిస్తానని మాయమాటలు
స్నేహితుడితో కలిసి బైక్‌పై బాలికను తీసుకెళ్లిన యువకుడు
హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘటన
రాజమహేంద్రవరంలో ఘటన
హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్.. షోకాజ్ నోటీసు జారీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్లో ఉంటూ టెన్త్ చదువుతోంది. ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన పాము అజయ్(22) పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని çసంబోధిస్తూ ఏదైనా అవసరమైతే తనకు చెప్పమనేవాడు.
ఈ క్రమంలో సోమవారం సా.5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర వస్తువులు తెచ్చుకుంటానని హాస్టల్ వార్డెన్ ఉమాదేవికి చెప్పి బయటకెళ్లింది. అయితే, అదేరోజు రాత్రి 7 గంటలకు బాలిక తల్లి హాస్టల్‌కు వచ్చింది. అదే సమయంలో బాలిక బయటి నుంచి రావడంతో ఎక్కడికి వెళ్లావని తల్లి నిలదీసింది. బాలిక జరిగినదంతా తల్లికి చెప్పింది. తనను అజయ్, రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన అతడి స్నేహితుడు కాగితపల్లి సత్యస్వామి (21) కలిసి బైక్ మీద బయటకు తీసుకెళ్లారని, సత్యస్వామి తమను రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ హోటల్ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి ఆరా తీయగా లాడ్జి నిర్వాహకులు జరిగిందంతా చెప్పారు. తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని యువకుడు చెప్పినట్లు వివరించారు. పోలీసులు అజయ్, సత్యస్వామిపై మంగళవారం కేసులు నమోదు చేశారు. అలాగే, మైనర్లకు గది ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. కలెక్టర్ కీర్తి చేకూరి హాస్టల్ వార్డెన్ ఉమాదేవికి షోకాజ్ నోటీసు జారీచేసి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు.