
తూర్పు గోదావరి జిల్లా: అతనికి నలుగురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ నిత్య పెళ్లికొడుకు. అతనిపై యానాం లోని గిరియాంపేటకు చెందిన రెండో భార్య శీలం సాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం గురువారం అతని మోసాల గురించి మీడియాకు వివరించింది. ‘యానాంలోని సావిత్రినగర్‌కు చెందిన ఎస్.రమేష్ నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమ గురించి 2016లో యానాం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చెప్పాం. పెద్దల సమక్షంలో యానాం వెంకన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నాం.
మాకు ఇద్దరు సంతానం కలిగారు. కానీ, అప్పటికే రమేష్‌కు భైరవపాలేనికి చెందిన కామేశ్వరితో మొదటి వివాహమైందని, ఆమెతో విభేదాలు రావడంతో వదిలేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నాతో కాపురం చేస్తూనే చొల్లంగిపేటకు చెందిన సత్యవేణిని మూడో వివాహం చేసుకున్నాడు. వీరవేణి అనే మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. నన్ను, నా పిల్లలను రోడ్డుపాలు చేశాడు. మూడో వివాహం చేసుకున్న మహిళను హైదరాబాదులో, నాలుగో పెళ్లి చేసుకున్న మహిళను కాకినాడలో పెట్టాడు.
మొదటి వివాహం చేసుకున్న ఆమెకు ఒక పాప. రెండో వివాహం చేసుకున్న నాకు ఇద్దరు పిల్లలు. మూడో వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు సంతానం. నాలుగో భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి. అయినా రమేష్ మళ్లీ ఐదో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. న్యాయం కోసం నేను పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని శీలం సాయి తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ అడగగా.. ఇద్దరిని కలపడానికి ప్రయతి్నంచామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.