రోడ్డు ప్రమాదంలో యువజంట మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక నరేంద్రపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో యువజంట మృతి చెందింది. నానమ్మ, మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని నందరాడకు చెందిన జుత్తుక లీలాప్రసాద్ (22), సౌమ్య (20) ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల పాప కూడా ఉంది. లాలాచెరువు సమీపంలోని బర్మా కాలనీలో నివాసం ఉంటున్న వారు ఆధార్ కార్డు అప్‌డేషన్ కోసం స్కూటీపై రాజానగరం వెళ్లి, తిరుగు ప్రయాణంలో నందరాడ వెళ్లేందుకు నరేంద్రపురం జంక్షన్ దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న లారీ పై జంక్షన్‌లో వేరొక స్కూటీని ఢీకొంది. దీంతో కంగారుపడిన లారీ డ్రైవర్ స్టీరింగ్‌ను ఎడమ వైపు (నరేంద్రపురం వైపు) తిప్పడంతో అప్పుడే జంక్షన్ దాటుతున్న ఈ యువజంట స్కూటీని ఢీకొని, వారి పైనుంచి దూసుకుపోయింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముందుగా ఢీ కొన్న స్కూటీపై ప్రయాణిస్తున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన నానమ్మ బొడ్డు వెంకటలక్ష్మి, మనవరాలు సూర్యకుమారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంటి పాపను అనాథను చేశారు
ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆనందగా జీవిస్తున్న లీలాప్రసాద్, సౌమ్యలను మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించి వేసింది. వారి అన్యోన్యతకు ప్రతిరూపంగా పుట్టిన మూడు నెలల పాపను అనాథగా మిగిల్చింది అంటూ ఆ యువజంట బంధువులు రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కదిలించి వేసింది. పాపను ఇంటి వద్దనే వదిలేసి, ఆధార్ అప్‌డేషన్ కోసం రాజానగరం వచ్చి, ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి లీలాప్రసాద్, సౌమ్య బంధువులు పరుగున వచ్చి, రక్తంతో మాంసం ముద్దగా మారిపోయిన ఆ మృతదేహాలను చూసి, గుండెలవిసేలా రోదించారు.
నానమ్మ, మనవరాలికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో యువజంట మృతి
రోడ్డు ప్రమాదంలో యువజంట మృతి


