కలవర్‌పాట్లు వద్దు!
● హోలీ వేళ రసాయన రంగులతో అనర్థాలు
● ఆనందంతో పాటు ఆరోగ్యం ముఖ్యం
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
● రేపే హోలీ పర్వదినం
రాయవరం: ఆకాశంలోని ఇంద్ర ధనస్సు పుడమిపైకి దూసుకొస్తుంది. కేరింతలతో పులకించే యువతపై మెరవనుంది. ఆ రంగులన్నీ కుప్పలుగా పోశారా అన్నట్లుగా పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా చేసుకునేదే హోళీ పండగ. అయితే రంగుట మాటున కష్టాలున్నట్టు.. రసాయనాలు కలిపిన రంగులు వాడితే ప్రమాదం తప్పదు. సహజ రంగులతో వసంత రుతువుకు స్వాగతం పలకాలని నేత్ర వైద్యులు, పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువత హోలీ వేడుకలు నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.
వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా..
వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా హోలీ పండగను పేర్కొంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున హోలీ వేడుకలు జరుపుకొంటారు. ఈ పండగను కాముని పున్నమి, డోలోత్సవం తదితర పేర్లతో పిలిచినా సందడి మాత్రం ఒక్కటే అని చెప్పవచ్చు. ఏటా వసంత మాసంలో హోలీ పర్వదినం వస్తుంది. చలి కాలానికి వీడ్కోలు పలుకుతూ వెచ్చని వేసవికి స్వాగతం పలికే హోలీ పండగతోనే తెలుగు సంవత్సరం ముగుస్తుంది. ఉగాది పర్వదినంతో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. హోలి దుఃఖాన్ని పారదోలి సుఖశాంతులను కలిగిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే రంగులు చల్లుకుని, మిఠాయిలు తింటారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
● హోలీ సందడిలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేడుకల్లో పాత దుస్తులనే సాధ్యమైనంత వరకూ వాడాలి. చిన్నారులు, యువతను గమనిస్తూ ఉండాలి. రంగులను దుస్తులపైనే చల్లాలి.
● రసాయనిక రంగులతో కళ్లకు హాని కలగకుండా కళ్లద్దాలు ధరించాలి. దంతాలపై రంగులు పడకుండా పళ్లకు డెంటల్ కాప్స్ వేసుకోవాలి. తలకు, శరీరానికి ముందుగానే ఆయిల్ రాసుకుంటే మంచిది.
● రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు తప్పనిసరిగా మూసుకోవాలి. జుత్తుపై రంగులు పడకుండా క్యాప్ పెట్టుకోవాలి. దీనివల్ల రంగుల నుంచి వెంట్రుకలను రక్షించుకోవచ్చు.
● హోలి తర్వాత గోరు వెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ సమయంలో కూడా రంగు నీరు కళ్లు, నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
● రంగుల పొడులు కళ్లలో పడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. రంగులతో మంట, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే శరీరాన్ని శుభ్రంగా కడిగి కొబ్బరి నూనెను రాసి చర్మ వైద్య నిపుణులను సంప్రదించాలి.
అపశ్రుతులకు తావివ్వరాదు
హోలీ పండగను ఆనందోత్సవాల మధ్య అపశ్రుతులకు తావులేకుండా జరుపుకోవాలి. స్నానం కోసం గోదావరి నది, చెరువుల్లోకి దిగరాదు. ముఖ్యంగా చిన్న పిల్లలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌లో లభించే రంగులు కల్తీగా ఉంటాయి. సహజ సిద్ధమైన రంగులు చల్లుకోవడం మంచిది. సిల్వర్ రంగు, ఇతర ప్రమాదకరమైన రంగులు చల్లుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి. కోడిగుడ్లను వాడకుండా దూరంగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించరాదు. రంగులు శరీరంపై ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఎండలో ఉండడం మంచిది కాదు.
చల్లని నీటితో శుభ్రం చేయాలి
కళ్లలో రంగులు పడితే కళ్లను నలపడం, రుద్దడం చేయకుండా చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆలస్యం చేయకుండా సమీపంలోని నేత్ర వైద్యున్ని సంప్రదించాలి. హానికర రంగులతో కంటి రెటినా దెబ్బతినే ప్రమాదముంది. కంట్లో ఉండే కంజెక్టినా పొర రసాయనాలకు ప్రభావితం అవుతుంది.
– రమ్య, వైద్యురాఉల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాయవరం
కలవర్‌పాట్లు వద్దు!


