దేశ భాషలందు తెలుగు లెస్స
● అమ్మ భాషను కాపాడుకుందాం
● రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
● అమలాపురంలో రెండో రోజు
తెలుగు మహాసభలు
అమలాపురం రూరల్: దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో గోదావరి గ్లోబల్ యూ నివర్సిటీ, కిమ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు రెండో రోజు ఆదివా రం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు మహాసభల వేదికపై ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా వికాసానికి మహత్తర పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా వ్యవహారిక తెలుగు ప్రాచుర్యానికి కృషి చేసి, భాషను ప్రజలకు చేరువ చేశారన్నారు. సుమారు 100 మిలియన్ల తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారని, వారంతా మన భాష ఉనికిని కాపాడుకోవాలన్నారు. తెలుగు భాషలో తీర్పు చెప్పేవారికి సహనం, చదువు చెప్పేవారికి ఓర్పు ఉండాలని సూచించారు. మహాభారతం సంస్కృత శైలిని ఆదికవి నన్నయ ఆంధ్రీకరించారని అన్నారు. తిక్కన మహాభారతాన్ని కొనసాగించి, సులభమైన భాషలో రచనలు చేసి ప్రజల్లో తెలుగు ప్రాచుర్యం పొందేలా చేశారన్నారు. యర్రాప్రగడ మహాభారతాన్ని పూర్తి చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత బలపరిచారన్నారు.
మూలాలు మరవద్దు
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడుతూ తెలు గు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అంటారని అన్నారు. మన భాష జీవిత విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు పిల్లలు మన భాషా మూలాలను మరువరాదన్నారు. భాషను కాపాడడం అంటే కేవలం పాఠ్య పుస్తకాల్లోనే కాదని, దానిని దైనందిన జీవితంలో ఉపయోగించడం, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేయడం, కొత్త తరాలకు అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు.
భాషను నేర్పించాలి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా వచ్చి తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చలపతిరావు మాట్లాడుతూ తెలుగులో ఉన్న 56 అక్షరాలు నేర్చుకుంటే ఇంగ్లిష్ ఉన్న అక్షరాలు నేర్చుకోవడం ఎంతో సులువు అని అన్నారు. అమ్మ భాషను మరువరాదన్నారు. జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ మాట్లాడుతూ తెలుగు భాషపై ప్రేమతో ఈ మహాసభలో పాల్గొడం ఆనందంగా ఉందన్నారు. చిన్నతనం నుంచే పిల్లలతో పెద్ద బాలశిక్ష చదించి, తెలుగు భాషను బోధించాలన్నారు. న్యాయమూర్తి గాడి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మన భాష తల్లి వంటిందని, చిన్నతనం నుంచి పాఠశాలల్లో పిల్లలకు నేర్పించాలన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలంటే ప్రాంతీయ భాష అవసరమన్నారు. జస్టిస్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భావితరాలు మన భాషా సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. శృంగేరీ పీఠం పండితుడు విశ్వనాథ గోపాలకృష్ణశర్మ, ప్రముఖ వేదపండితుడు బంగారయ్యశర్మ, హైకోర్టు ఏజీఏ నరసింహశర్మ, ధనంజయ ప్రసంగించగా.. ప్రముఖ కథా రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ తెలుగు భాషలో పాటలు పడుతూ ఉత్తేజపరిచారు.
నిర్బంధ విద్య అవసరం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నిర్బంధంగా కన్నడను కర్ణాటకలో బోధిస్తున్నారని, మనకు తెలుగు భాషలో విద్యా బోధన డిగ్రీ స్థాయి వరకూ జరగాలన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగు భాష వైభవం గురించి మాట్లాడారు. డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి ప్రసంగిస్తూ సాంకేతిక యుగంలో తెలుగు వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయన్నారు. సభకు అధ్యక్షతన వహించిన చైతన్యరాజు ప్రసంగిస్తూ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు ఆనందరావు, బండారు సత్యానందరావు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ, గైట్ ఎండీ కె.శశి, రిటైర్డ్ డీఏజీ ఏకే ఖాన్, నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీ ప్రసంగించారు. సినీ నటుడు చిరంజీవికి ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాన్ని అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి, అలాగే అంతర్జాతీయ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌కు ప్రకటించిన పురస్కారాన్ని ఆయన తల్లి రంగమణి అందుకున్నారు. సినీ నటుడు సుమన్, బ్యాండ్ మేళం సినిమా హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీదేవి పాల్గొన్నారు.
పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను సత్కరిస్తున్న కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు
దేశ భాషలందు తెలుగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స


