క్లీనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం
సఖినేటిపల్లి: సఖినేటిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శనివారం అంతర్వేది రాంబాగ్ వద్ద చెట్టును ఢీకొన్న ఘటన జరగడానికి డ్రైవింగ్ అనుభవం లేని క్లీనర్ తప్పిదమే కారణమని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని క్లీనర్‌కు బస్ స్టీరింగ్ ఇచ్చిన క్రమంలో గేదె అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోని కొబ్బరి చెట్టును ఢీకొన్నారన్నారు. కాగా రావులపాలెం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఓలేటి శ్రీనివాస్ జరిపిన విచారణలో బస్సు కండీషన్ బాగానే ఉందని, క్లీనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తేలిందన్నారు. ఇదిలా ఉండగా బస్సును సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ లైసెన్స్ మూడు నెలలు, బస్సు పర్మిట్ కూడా ఒక నెల సస్పెండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.
25 వాహనాల సీజ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర, ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు. శని, ఆదివారాల్లో కడియం మండలం పరిధి, బొమ్మూరు నుంచి వేమగిరి వెళ్లే హైవే మధ్యలో రూట్ చెక్ నిర్వహించామన్నారు. పంగిడి నుంచి వస్తున్న 12 రోడ్ మెటల్ లారీలు, రంగంపేట నుంచి వస్తున్న 8 గ్రావెల్ లారీలు, రాఘవాపురం నుంచి వస్తున్న ఐదు ఆర్టీనరీ ఎర్త్ రవాణా చేస్తున్న లారీలు గుర్తించామని తెలిపారు. వాహనాల డ్రైవర్లు సరైన మైనింగ్ బిల్లులు చూపించక పోవడంతో మొత్తం 25 వాహనాలను స్వాధీనం చేసుకుని, కడియం పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీలో కార్యాలయ అసిస్టెంట్ జియాలజిస్ట్‌లు జి.విఘ్నేశ్వరుడు, డి.జ్యోతిర్మయి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మనీషా, టెక్నికల్ అసిస్టెంట్ ఎ.శైలజ పాల్గొన్నారు.


