ఇంతింతై సాగుతూ.. | - | Sakshi
Sakshi News home page

ఇంతింతై సాగుతూ..

Mar 2 2026 8:14 AM | Updated on Mar 2 2026 8:14 AM

ఇంతిం

ఇంతింతై సాగుతూ..

ఫ కూరగాయల సాగులో గిరిజన మహిళలు

ఫ కష్టమైనా ఇష్టపడి వ్యవసాయం

ఫ ఇంటి పంటలతో ఆర్థిక ఆదాయం

చింతూరు: మహిళామణులు అన్నింటా రాణిస్తున్నారు.. ఏజెన్సీలో అతివలు ఇంటి పంటలను తమ ఆర్థిక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమ ఇంటి పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండించి వాటిని విక్రయించడం ద్వారా కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో గిరిజన మహిళలు ఇంటి పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు ఏడాది పొడవునా పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, కషాయాలు వినియోగించి పండిస్తున్న ఈ పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. ఇలా చాలామంది మహిళలు ఇంటి పంటలపై ఆసక్తి చూపుతున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు లభ్యమవుతుండడంతో వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటి పంటల ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.లక్ష వరకూ ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని అంచనా.

పంట పండిస్తున్నారు ఇలా..

ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి దుక్కిదున్ని కూరగాయల సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను కొనుగోలు చేసి వాటిని చల్లుతున్నారు. ఇళ్లలోని మోటార్లు, చేతి బోర్ల సాయంతో తడులు పెడుతూ నీటి ఎద్దడి లేకుండా చూసుకుంటున్నారు. రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు, పురుగు మందులకు బదులు కషాయాలను వినియోగిస్తున్నారు.

ఇంటిల్లపాదీ కలసి సేద్యం చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు మంచిగా పండేలా కష్టపడుతున్నారు. పంటను పశువులు పాడు చేయకుండా చుట్టూ కంచె నిర్మిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల్లో ఆనప, వంకాయ, బెండ, బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, టమాటా, కాకర, బరబోటి వంటివి పండిస్తున్నారు. ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా వంటివి సాగు చేస్తున్నారు. నాలుగు ముంపు మండలాల్లో సుమారు వంద మంది మహిళలు కొన్నేళ్లుగా సుమారు 250 ఎకరాల్లో కూరగాయలను పండిస్తూ ఆర్థిక ఆదాయం పొందుతున్నారు.

కుటుంబానికి ఆర్థిక

వెసులుబాటు

కుటుంబ పోషణ నిమిత్తం కూరగాయల సాగు చేస్తున్నాం. కష్టమైనా ఎంతో ఇష్టంతో కూరగాయలు పండిస్తు న్నాం. ప్రతి రోజూ ఉదయమే వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దీని ద్వారా మా కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది.

– జయమ్మ, కుమ్మూరు, చింతూరు మండలం

ప్రభుత్వం సహకారం

అందించాలి

కూరగాయల సాగు నిమిత్తం పెట్టుబడి అధికంగా అవుతోంది. అప్పులు చేసి పంట సాగుచేసిన పిదప వచ్చిన ఆదాయంతో అప్పులు తీరుస్తున్నాం. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేయడంతో పాటు రుణాలు అందిస్తే కూరగాయల సాగులో మరింత ప్రగతి సాధిస్తాం.

– రాధాబాయి, చూటూరు, చింతూరు మండలం

అతివలు అంతకంతకూ ఎదుగుతున్నారు.. కుటుంబ పోషణకు మేము సైతం అంటూ ముందుకు ‘సాగు’తున్నారు.. పురుషులకే సాధ్యమైన వ్యవసాయంలో తామేమీ తీసిపోమన్నట్టుగా కూరగాయల సాగుపై దృష్టి సారించారు.. ఇళ్ల వద్ద తమ కున్న కొద్దిపాటి భూముల్లో సాగు చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ, వాటి విక్రయాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. గిరి మహిళలు

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మండల కేంద్రాల్లో విక్రయాలు

గిరిజన మహిళలు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను మండల కేంద్రాలకు తీసుకొచ్చి ప్రధాన కూడళ్లలో విక్రయిస్తున్నారు. కూరగాయలను పోగులుగా, ఆకుకూరలను కట్టలుగా కట్టి పోగు రూ.20కి, కట్ట రూ.5 లేదా రూ.10కి విక్రయిస్తున్నారు. ఉదయమే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తుండడంతో వినియోగదారులు అధిక శాతం వాటినే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన సెంటర్లు, బస్సులు నిలిపే ప్రదేశాల్లో కూరగాయలు, ఆకుకూరలు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులతో పాటు ప్రయాణికులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నారు. అప్పటికప్పుడు కోసి తీసుకు రావడం, సేంద్రియ ఎరువులతో పండిస్తుండడంతో ఇవి వండితే రుచికరంగా ఉంటున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు.

ఇంతింతై సాగుతూ..1
1/4

ఇంతింతై సాగుతూ..

ఇంతింతై సాగుతూ..2
2/4

ఇంతింతై సాగుతూ..

ఇంతింతై సాగుతూ..3
3/4

ఇంతింతై సాగుతూ..

ఇంతింతై సాగుతూ..4
4/4

ఇంతింతై సాగుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement