
లైంగిక దాడికి యత్నించిన నారాయణరావు (చంద్రబాబు చిత్రపటంతో ఉన్న వ్యక్తి), నారాయణరావుకు దేహశుద్ధి చేస్తున్న స్థానికులు
తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లిన కీచకుడు
అడ్డగించిన వ్యక్తికి తాను కౌన్సిలర్‌నంటూ బెదిరింపులు
స్థానికుల దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత
నిందితుడు అరెస్టు.. కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు
విచారణకు మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు
కాకినాడ జిల్లా తుని మండలంలో దారుణం
తుని రూరల్ : తాతయ్యా అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై ‘నేను కౌన్సిలర్‌ను. మేం ఎస్సీలం’ అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.
తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్లి, వస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) మంగళవారం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంజక్షన్ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు.
దీంతో.. ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ కాపలాదారుడిని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ, తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును, బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు.
బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేసూ్తనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో, బాలికకు న్యాయంచేయాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిసున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశాలలో దించి, నారాయణరావు కొండవారపేట వెళ్లిపోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పటు్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
నాలుగైదుసార్లు ఇలాగే..
తాతయ్యనంటూ చెప్పి, గతంలో నాలుగైదుసార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకువెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. తాజాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదుచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నేతలు, యువకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విచారణకు మూడు బృందాలు..
బాలికపై లైంగిక దాడికి యత్నించిన నారాయణరావును అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులలో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. 15 రోజుల్లో చార్‌్జషీట్ దాఖలు చేస్తామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు.