
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని గుడారిగుంట ప్రకాశ్ నగర్‌కు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని వెల్పేర్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది.
ఆమెకు రావులపాలేనికి చెందిన అజయ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని పిలుస్తూ, ఏదైనా అవసరం అయితే తనకు చెప్పమనేవాడు. ఇదిలావుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర సామగ్రి తీసుకువస్తానని హాస్టల్ వార్డెన్‌కు చెప్పి బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి ఏడు గంటలకు బాలిక తల్లి హాస్టల్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆ బాలిక బయట నుంచి రావడంతో తల్లి ఎక్కడికి వెళ్లావని అడిగింది. దీంతో ఆమె జరిగిదంతా చెప్పింది.
తనను అజయ్, అతడి స్నేహితుడు బయటకు తీసుకెళ్లారని, స్నేహితుడు తమను రైల్వే స్టేషన్ ఎదురుగానున్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ తనను హోటల్ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. లాడ్జి నిర్వాహకులు జరిగిదంతా చెప్పారు. యువకుడు, బాలిక వచ్చి తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని చెప్పారన్నారు. దీంతో పోలీసులు అజయ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.