అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు.
శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్‌కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది.
ఏం కష్టం వచ్చిందో కానీ..
శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్‌కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్‌ఫోన్‌లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్‌కుమార్ హరీష్‌కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్‌కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు.
ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్‌కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్‌కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.


