సికింద్రాబాద్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు మిత్రుల కళ్లెదుటే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి శివనగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ కుమారుడు రవిశంకర్ (30) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు.
దీంతో మనస్తాపానికి గురైన రవిశంకర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నేరేడ్‌మెట్‌లోని తన స్నేహితుడు శ్రీధర్ ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఇరువురు కలిసి అదే కాలనీలో నివసించే మరో మిత్రుడు సాయిప్రశాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడికి శైలేష్ జగన్ అనే మరో ఇద్దరు మిత్రులు వచ్చి రాత్రి 12.30 గంటల వరకు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవిశంకర్‌ను ఓదార్చారు. అర్దరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రవిశంకర్‌ను అతడి ఇంట్లో దింపి వచ్చేందుకు మిత్రులు అందరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మార్గంమధ్యలో వాజపేయినగర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడింది.
దీంతో ద్విచక్ర వాహనాలను నిలిన స్నేహితులు గేట్ తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిత్రుడి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రవిశంకర్ ఉన్నఫలంగా దిగిపోయి మిత్రులు చూస్తుండగానే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చినన రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. అంబులెన్స్‌ను రప్పించిన మిత్రులు రవిశంకర్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఉద్యోగం రావడం లేదని, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు పని చేశానని కొద్ది రోజులుగా రవిశంకర్ మనస్తాపానికి గురవుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


