
కరప: కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం బంధాలను చిదిమేస్తోంది. మద్యం మత్తు తండ్రీకొడుకుల మధ్య ఘర్షణకు దారి తీసి, చివరికి తండ్రిని తనయుడు కడతేర్చేలా చేసిన ఘటన కాకినాడ జిల్లా కరప పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మొండి గ్రామానికి చెందిన కాలాడి సూర్యచంద్రరావు(50)కు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు ధనుంజయ్‌కు వివాహం కాగా వేరు కాపురం పెట్టాడు.
భార్య అనారోగ్యంతో మరణించగా, తండ్రి మిగిలిన ముగ్గురి కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సూర్యచంద్రరావు మద్యానికి బానిసయ్యాడు. రెండో కుమారుడు చంద్రశేఖర్ పనిచేస్తూ, అన్నీ చూసుకుంటూ, వంట చేసి పెడుతుంటాడు. చిన్నకుమారుడు మహేష్ ఫిట్స్ వ్యాధిగ్రస్తుడు. ఈ నేపథ్యంలో మంగళవారం మహేష్ కు మందులు తీసుకురమ్మని తండ్రికి చంద్రశేఖర్ రూ.500 ఇచ్చాడు.
సూర్యచంద్రరావు ఆ డబ్బుతో మద్యం తాగి వచ్చాడు. దీంతో అప్పటికే మద్యం తాగి ఉన్న చంద్రశేఖర్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి తలపై గొడ్డలి తిరగేసి దాడి చేయడంతో సూర్యచంద్రరావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాకినాడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.