breaking news
malli babu
-
గాజువాక గణేశునికి 12.5 టన్నుల లడ్డూ
వినాయక చవితి వేడుకలకు భారీలడ్డూల తయారీలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం మరో మహా లడ్డూ తయారీకి వేదిక కానుంది. ఖైరతాబాద్ గణనాథునికి భారీలడ్డూలను సమర్పించడంలో ఖ్యాతిగాంచిన సురుచి ఫుడ్స్ సంస్థ 12.5 టన్నుల మహాలడ్డూతో సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం తాపేశ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్లో గుజరాత్లోని అంబాల పట్టణంలో అరసూరి అంబాజిమాత దేవస్థానం ట్రస్టు తయారుచేసిన 11,115 కిలోల లడ్డూ ఇప్పటి వరకు గిన్నీస్ రికార్డుగా ఉందన్నారు. ఇప్పుడు ఈ రికార్డును తాము అధిగమించనున్నట్టు తెలిపారు. 12,500 కిలోల మహాలడ్డూను తయారుచేసి విశాఖ గాజువాకలో ఏర్పాటుచేస్తున్న దేశంలో కెల్లా అతిపెద్ద మహాగణపతికి బహూకరిస్తామన్నారు. గణేష్ మహాలడ్డూ తయారీలో గిన్నీస్ రికార్డు స్థాపించమని గతం నుంచి తనపై అనేక ఒత్తిడులు ఉన్నా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నియమాలకు కట్టుబడి ఆ ప్రయత్నం చేయలేదన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూ మాత్రమే పంపిస్తున్నామని, గిన్నీస్ రికార్డు మన రాష్ట్రంలోనే చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. 12.5 టన్నుల లడ్డూ తయారీకి సుమారు రూ.30 లక్షలు వ్యయమవుతుందని, ఆ మొత్తాన్ని బంధువులు, మిత్రుల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నానని చెప్పారు. లడ్డూ తయారీలో 2,400 కిలోల నెయ్యి, 600 కిలోల నూనె, 3,350 కిలోల శనగపిండి, 4,950 కిలోల పంచదార, 400 కిలోల జీడిపప్పు, 200 కిలోల బాదంపప్పు, 125 కిలోల యూలకులు, 30 కిలోల పచ్చకర్పూరం వినియోగించనున్నట్టు తెలిపారు. ఈనెల 28న సురుచి ఆవరణలో ఏర్పాటు చేసిన మహాలడ్డూ తయారీ ప్రాంగణంలో గణనాథుని ప్రతిష్ఠించి తనతో పాటు 20 మంది సురుచి సిబ్బంది గణేష్మాలలు ధరించి లడ్డూ తయారీ దినుసులు సిద్ధం చేసుకుంటామన్నారు. సెప్టెంబరు 2న తయారీ ప్రారంభిస్తామని, 3న లడ్డూను అలంకరిస్తామని, 4న సాయంత్రం భారీ క్రేన్ల సాయంతో ప్రత్యేక వాహనంలో గాజువాక తరలిస్తామని వివరించారు. గతంలో మాదిరి హైదరాబాద్ చేపల బజార్ గణేశునికి 100 కిలోలు, జిల్లాలో ప్రసిద్ధి చెందిన అయినవిల్లి, బిక్కవోలు, రామచంద్రపురంలోని దఫేదార్ గణేశులకు 50 కిలోల లడ్డూలను, కాకినాడ గణపతికి 25 కిలోల లడ్డూను కానుకగా అందజేయనున్నట్టు తెలిపారు. -
ఖైరతాబాద్ వినాయకుడిపై పూల వర్షం కురిపిస్తాం
-
ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
-
ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం. ఇంకెక్కడో హైదరాబాద్లోని ఖైరతాబాద్. అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన భారీ లడ్డును శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతికి అలంకరించారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు నేతృత్వంలో రూపొందిన ఈ ఐదు టన్నుల లడ్డూను ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకొచ్చి.. ఇక్కడ గణపతి చేతుల్లో అలంకరించారు. వాస్తవానికి 2010 సంవత్సరం నుంచే ఖైరతాబాద్ గణేశుడి చేతిలో నిజమైన లడ్డూ అలంకరించడం మొదలైంది. అంతకుముందు వరకు మట్టిలడ్డూ పెట్టేవారు. కానీ, 2009లో మల్లిబాబు తన కూతురితో కలిసి ఖైరతాబాద్ గణపతిని సందర్శించుకున్నప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. దాంతో ఆ తర్వాతి నుంచి అసలైన లడ్డూను తాను చేసి పంపుతానని మల్లిబాబు ఉత్సవ కమిటీ పెద్దలను ఒప్పించాడు. 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించారు.