బేసి రామచంద్రాపురంలో యువతి హత్య!

Young Woman Suspicious Death In Srikakulam - Sakshi

తువ్వాలుతో గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు

హత్యానేరంగా కేసు నమోదు చేసిన పోలీసులు

శ్రీకాకుళం, సోంపేట: స్నానానికని వెళ్లిన యువతి పట్టపగలే హత్యకు గురైన ఘటన సోంపేట మండలంలోని బేసి రామచంద్రాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బారువ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బేసి రామచంద్రాపురం గ్రామానికి చెందిన కురా మహంతి, రాధామణి మహంతిల కుమార్తె కనకలత మహంతి అలియాస్‌ లిల్లీ(22). కురా మహంతి తణుకులో వంట పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కనకలత స్థానిక ఒడియా మాధ్యమ పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేస్తోంది.

ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు స్నానం చేయడానికి ఊరు బయట ఉన్న బావి వద్దకు వెల్లడం తల్లీకుమార్తెలకు అలవాటు. ఎప్పట్లాగే శనివారం కూడా ఇద్దరూ బయలుదేరుతుండగా తల్లిని వద్దని చెప్పి కనకలత ఒంటరిగా స్నానానికి వెళ్లింది. బకెట్, దుస్తులు రహదారి వద్ద ఉంచి, పక్కనే తోటలోకి బహిర్భూమికి వెళ్లింది. చాలాసేపు దుస్తులు రోడ్డుపైనే ఉండటాన్ని గమనించిన స్థానికులు అనుమానం వచ్చి తోటలోకి వెళ్లి చూశారు. అక్కడ కనకలత విగత జీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే తల్లి, తమ్ముడు గోవింద వచ్చి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కనకలత మెడకు గట్టిగా బిగించి ఉన్న తువ్వాలును విప్పి ప్రాణాలు కాపాడడానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యువతి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

హత్యానేరంగా కేసు నమోదు
యువతి హత్యకు గురైందన్న విషయం తెలియగానే ఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ ప్రసాద్‌బాబు, సోంపేట ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గా ప్రసాద్‌ సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో పరిసరాలు గాలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. బారువ ఏఎస్‌ఐ కృష్ణారావు ‘హత్యానేరంగా’ కేసు నమోదు చేసి సీఐ టి.తిరుపతి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నారు.

మృతిపై అనుమానాలు..
మృతదేహం ఉన్న ప్రదేశం గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉండడం, చెంతనే రహదారి ఉండటంతో పట్టపగలు ఎలా హత్య చేశారో అన్నది అంతుచిక్కడం లేదు. తెలిసిన వారే కనకలతను లోపలికి తీసుకు వెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తిరిగి రోడ్డుపై పడేసి ఉంటారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖంపై తీవ్రమైన గాట్లు ఉండడంతో లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడి ఉంటారని మరికొందరు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.

వివాహమైన 20 ఏళ్ల తర్వాత..
కురా, రాధామణి మహంతిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత కనకలత మహంతి జన్మించింది. దీంతో చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నిత్యం కలిసే స్నానానికి వెళ్లేవారమని, ఒక్కరోజు రాకపోవడంతో ఎంత ఘోరం జరిగింది తల్లీ అంటూ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కనకలత విద్యావలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నా తన పని తాను చేసుకుని వచ్చేదని, ఉపాధ్యాయులతో కూడా ఎక్కువగా మాట్లాడేది కాదని స్థానికులు చెబుతున్నారు. తమకు పాఠాలు బోధించే ఉపాధ్యాయిని మృతి చెందిందని విషయం తెలియడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

మూడేళ్ల కిందటా ఇలాగే..
మూడు సంవత్సరాల క్రితం ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇంజీనీరింగ్‌ విద్యార్థిని నర్మదా మహంతిని ఒడిశాలో హత్య చేసి బేసి రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన మృతదేహాన్ని పడేశారు. అప్పట్లో ఈ హత్యోదంతం పెను సంచలనం సృష్టించింది. మళ్లీ అదే ప్రాంతంలో యువతి మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top