
సాక్షి, ప్రకాశం : ప్రేమించిన యువతి బంధువులు బెదిరింపులకు పాల్పడటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కలలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈతముక్కలకు చెందిన వెంకటకృష్ణ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కానీ యువతి తరఫు పెద్దలు ఆమెకు వేరే పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటకృష్ణ ఆమె పెళ్లిని చెడగొట్టాడు. ఆ తర్వాత యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
తమ అమ్మాయి పెళ్లి ఆగిపోవడంతో ఆమె తరఫు బంధువులు వెంకటకృష్ణపై బెదిరింపులకు దిగడంతో.. భయాందోళనకు గురైన వెంకటకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి ఆ యువతి బంధువులే కారణమని భావించిన వెంకటకృష్ణ బంధువులు వారి ఇళ్లపై దాడులకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఎస్సైకి కూడా గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను మోహరించారు.