ఆస్పత్రిలో పరిచయం: ఆపై తరచూ ఫోన్లో..

Woman Killed By EXtramarital Sexual Partner After Fight In Pathancheru - Sakshi

మహిళ హత్య కేసులో వ్యక్తి రిమాండ్‌

మద్యం తాగిన తర్వాత వాగ్వాదమే హత్యకు దారి..

రాములుపై 10 హత్య కేసులు, 4 దొంగతనం కేసులు

గతంలో పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన నిందితుడు

సాక్షి, పటాన్‌చెరు: లక్డారం శివారులో గుర్తు తెలియని మహిళ ఈ నెల 13న హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలో హత్యకు గురైన అంజిలమ్మపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. అంజిలమ్మ కూతురు మమత ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ నరేష్‌ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సంగారెడ్డి మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ గచ్చిబౌలి లో భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గతంలో రాములు భార్య రాములుతో గొడవపడి యాసిడ్‌ తాగింది. దీంతో ఆమెను చికిత్స కోసం రాములు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నంచర్ల గ్రామానికి చెందిన అంజిలమ్మ అదే సమయంలో తన తల్లిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఆ సమయంలో రాములు, అంజిలమ్మకు పరిచయం ఏర్పడింది. తర్వాత అంజిలమ్మ, రాములు తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

ఈ క్రమంలో ఈ నెల 12న రాములు అంజిలమ్మను చేవెళ్లలో కలసి మండల పరిధిలోని లక్డారం గ్రామానికి బైక్‌పై తీసుకువచ్చాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి లక్డారం గ్రామ శివారులోని నింగసానికుంట వద్ద ఉన్న నిర్మానుష ప్రదేశంలో మద్యం సేవించారు. అనంతరం శారీరకంగా కలిసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను రాములు తన హెల్మెట్‌తో కొట్టి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడుతో అంజిలమ్మ మెడకు బిగించి హత్య చేశాడు.

అనంతరం అంజిలమ్మ పుస్తెలు తాడు, ఫోన్‌ తీసుకొని రాములు వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా రాములును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తానే అంజిలమ్మను చంపిన్నట్లు ఒప్పుకున్నాడు. కాగా రాములుపై హైదరాబాద్, సైబరాబాద్, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10 హత్య కేసులు, 4 దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు మాయని రాములును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top