ఉసురు తీసిన వేధింపులు

Woman Hangs Herself After Been Sexually Harassed Through Phone Calls - Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటనలు

సాక్షి, రామన్నపేట: ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని.. ఓ వ్యక్తి వేధింపులకు వివాహిత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనలకు సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌నారాయణపురం మండలకేంద్రానికి చెందిన పొట్ట వెంకటయ్య హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతని కూతురు (14) పదవ తరగతి చదువుకుం టోంది. వెంకటయ్య ఇంటికి సమీపంలో ఉండే సుక్క గిరిబాబు చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్నాడు. వెంకటయ్య కుమార్తెకు సెల్‌కు ప్రేమ సందేశాలు పంపించడం, వెళ్లేదారిలో అడ్డుకుంటూ ప్రేమించాలని వేధించసాగాడు. ఇలా రెండు నెలలుగా ప్రేమ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం బయటకు పొక్కింది.

ఇటీవల వెంకటయ్య చేతివేళ్లు విరగడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. గురువారం బోనాల పండుగ కావడంతో కుటుంబ సభ్యులు గుడి దగ్గరికి వెళ్లగా ఆ విద్యార్థిని ఇంట్లో ఒక్కతే ఉంది. ప్రేమ వేధింపుల విషయం తండ్రికి తెలిసిపోతుందనా లేక గిరిబాబు ఏమైనా వేధింపులు గురిచేశాడో తెలియదు కానీ ఆమె సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిం చింది. శుక్రవారం వెంకటయ్య బంధువులు రావడంతో సంఘటనపై ఆరా తీయగా విష యం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

సంఘటన స్థలాన్ని చౌటుప్పల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు సందర్శించి వివరాలు సేకరించారు.  తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిబాబు మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు. ప్రస్తు తం అతను పరారీలో ఉన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లింద్రండులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఆకతాయి వేధింపులకు వివాహిత..
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మా ని గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి లింగారెడ్డి–రాణిల మూడవ కుమార్తె శృతి(24)ని, గత మే 15న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ఇట్టె మహిపాల్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. దంపతుద్దరూ హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో నివాముంటున్నారు. ఈ నెల ఆగస్టు 11,12,13 తేదీల్లో నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన ముడిదొడ్డి గణేశ్‌ అనే యువకుడు శృతికి ఆమె భర్త ఫోన్లకు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లు పెట్టడంతో పాటు ఫోన్‌చేసి వేధించాడు.

గణేశ్‌ వేధింపులను శృతి తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లగా నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దంపతులిద్దరూ ఈనెల 27న దుబ్బాక గ్రామానికి వచ్చారు. తిరిగి గణేశ్‌ అసభ్యపదజాలంతో ఇద్దరి ఫోన్లకు మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. దీంతో శృతి తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం 8.30గంటల సమయంలో స్నానం చేయడానికి బాత్‌రూంలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానానికి వెళ్లిన శృతి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో మహిపాల్‌రెడ్డి బాత్‌రూం వద్దకు వెళ్లి చూడగా ఊరివేసుకొని ఉంది.

తలుపులు పగులగొట్టి బయటకు  తీసుకువచ్చి చూడగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి బొమ్మిరెడ్డి లింగారెడ్డి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ చిల్లా సాయిలు తెలిపారు.  వివాహానికంటే ముందు తన కూతురు శృతి బీఫార్మసీ చేసే సమయంలోనూ గణేశ్‌ ప్రేమ పేరుతో వేధించగా నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బొమ్మరెడ్డి లింగారెడ్డి తెలిపారు. తన కూతురు మరణానికి గణేశ్‌ వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తహసీల్దార్‌ వి.బ్రహ్మయ్య ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో పంచనామా నిర్వహించారు. 

రామాన్నపేట : శృతి మృతదేహం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top