
ఫ్లై ఓవర్ కింద మహిళ మృతదేహం, గాయపడ్డ రవి..
పెద్దపల్లి : హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌లపైన జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వింటూ ఉంటాం.. సరిగ్గా అలాంటి ప్రమాదమే పెద్దపల్లి పట్టణ సమీపంలోని రాఘవాపూర్ ఫ్‌లై ఓవర్ బ్రిడ్జిపై చోటు చేసుకుంది. పెద్దపల్లి నుంచి మంథని వెళ్తుండగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో టూవీలర్‌పై ఉన్న కల్పన (35) ఎగిరి కిందపడి ప్రాణాలు వదిలింది. మంథనికి చెందిన కల్పన, కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన అలువాల రవి పరిచయస్తులు.
ఆమెను మంథనిలో విడిచి పెట్టేందుకు శనివారం పెద్దపల్లి నుంచి రవి తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. బ్రిడ్జిపైకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడ్డ రవిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు తిరిగి లారీని ఢీకొని మరోసారి ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై జగదీశ్ పేర్కొన్నారు.