ఇంజక్షన్‌ వికటించి మహిళ మృతి

Woman Died With Wrong Injection In East Godavari - Sakshi

మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువుల ఆందోళన

తాడితోట (రాజమహేంద్రవరం): ఇంజక్షన్‌ వికటించి ఓ మహిళ మృతి చెందింది. కోరుకొండ మండలం కణుపురు గ్రామానికి చెందిన దొడ్డి అమ్మాజీ(55) తలలో నరాల బలహీనత గురించి వైద్యం చేయించుకునేందుకు సోమవారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీ డాక్టర్‌ నాయక్‌ ఆమెను పరీక్షించి ఇంజక్షన్‌ చేయమంటూ డ్యూటీ నర్సుకు అప్పగించారు. అయితే ఇంజక్షన్‌ చేసిన కొద్ది క్షణాలకే ఆ మహిళ మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, మృతికి కారణమైన నర్సుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇంజక్షన్‌ ఒకేసారి చేయకుండా సెలైన్‌ బాటిల్‌ ద్వారా ఎక్కించాలని సూచించినా నర్సు పట్టించుకోకుండా ఇంజక్షన్‌ చేసిందని, అందువల్లే ఆమె మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. సంఘటనపై డాక్టర్లతో ఆమె చర్చించారు. డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యంపై నిలదీశారు. మరోవైపు మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు శివ, బీసీ యువజన సంఘం నాయకులు దాస్యం ప్రసాద్, మృతురాలి బంధువులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top