పెళ్లైన కొద్ది రోజులకే భర్త వివాహేతర.. | Woman Committed Suicide At Hyderabad | Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధం తట్టుకోలేక.. నవ వధువు ఆత్మహత్య  

May 27 2018 9:03 AM | Updated on Nov 6 2018 8:16 PM

Woman Committed Suicide At Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ :  భర్త వివాహేతర సంబంధం ఓ నవ వధువు ఉసురు తీసింది. వివాహమై రెండున్నర నెలలు గడవకముందే భర్త వేధింపులు భరించలేక చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదని అల్లుడే ఉరేసి చంపాడంటూ మృతురాలి తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా కూరేళ్లగూడెం అంబర్‌పేటకు చెందిన సుజాత వివాహం యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులోని తిరుమల అపార్ట్‌మెంట్స్‌లో నివసించే సత్యనారాయణతో ఈ ఏడాది మార్చి 2వ తేదీన జరిగింది. సత్యనారాయణకు వివాహానికి ముందే సత్యవతి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే సుజాతను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. సత్యవతిని నేరుగా ఇంటికే తీసుకొచ్చి భార్య ముందే ఆమెతో పరాచకాలాడుతూ గడిపేవాడు.

ఇదేమిటని నిలదీస్తే సుజాతను తీవ్రంగా కొట్టేవాడు. హింసించేవాడు. ఈ నెల 24వ తేదీన తన తల్లికి ఫోన్‌ చేసి సత్యవతి ముందే తనను తీవ్రంగా కొట్టాడని సమస్యను పరిష్కరించాలని రోధిస్తూ చెప్పింది. తల్లి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే శుక్రవారం సాయంత్రం తల్లి కుమారికి శివకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ చేసి మీ అమ్మాయి ఉరేసుకుందని, స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు. దీంతో కుమారి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. విచారించగా తన కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరేసుకోలేదని అల్లుడు సత్యనారాయణ హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కొంత కాలంగా కూతురిని బాగా కొడుతున్నాడని వివాహేతర సంబంధం ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement