హంతకులను పట్టించిన మద్యం సీసా మూత

Wife Planned To Murder Husband In Nagole - Sakshi

తాగొచ్చి వేధిస్తున్నాడని...భర్తను హత్య చేయించిన భార్య 

ఐదుగురు వ్యక్తుల అరెస్ట్‌

సాక్షి, నాగోలు: మద్యానికి బానిసైన భర్త తరచూ వేధింస్తుండడంతో పాటు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండడాన్ని సహించలేని ఓ మహిళ తన బంధువులతో కలసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో శనివారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. శామీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో అద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన బోణి శ్రీనివాస్‌కు 14 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కూలిపని చేసే శ్రీనివాస్‌ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. అత్తమామలను సైతం ఇబ్బంది పెడుతున్నాడు.

దీంతో శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. స్వప్న తన మేనమామ తీగళ్ల యాదగిరిని సంప్రదించగా అందుకు అంగీకరించిన అతడు స్వప్న కుటుంబ సభ్యుల నుంచి కొంత నగదు మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. యాదగిరి అతడి స్నేహితుడు రమేష్, స్వప్న, ఆమె తల్లి లక్ష్మి, తండ్రి మల్లేశం కలిసి హత్యకు పథకం పన్నారు. గతనెల 29న యాదగిరి, రమేష్‌ శ్రీనివాస్‌కు మద్యం తాగించి ధర్మవరం ప్రాంతంలోని రవలకోలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌ను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. శ్రీనివాస్‌ కనిపించకపోవడంతో ఇతడి తల్లి శామీర్‌పేట్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అడవిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడు శామీర్‌పేట పరిధిలో అదృశ్యమైన శ్రీనివాస్‌గా గుర్తించి దర్యాప్తు చేపట్టారు.  

పట్టించిన మద్యంసీసా మూత..
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంఘటనా స్థలంలో ఓ మద్యం సీసా మూత లభించింది. దానిపై ఉన్న బార్‌కోడ్‌ ఆధారంగా పూడూరు ఎక్స్‌రోడ్‌లో జైదుర్గ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వైన్స్‌ షాప్‌ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా యాదగిరి, రమేష్, మృతుడు శ్రీనివాస్‌ను బైక్‌పై తీసుకెళుతుండడాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హత్య తో సంబంధం ఉన్న శ్రీనివాస్‌ భార్య స్వప్న, అత్తమామలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top