
రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపులకు 89,344 దరఖాస్తులు
అత్యధికంగా శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 8,110..
అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో వచ్చింది 622
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలు మినహాయిస్తే నల్లగొండలో అత్యధిక దరఖాస్తులు
దరఖాస్తు ఫీజు రూపంలో ఖజానాకు రూ.2,680 కోట్ల ఆదాయం
మరో మూడు రోజులు గడువు పొడిగించిన ఎక్సైజ్ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఒక్కో వైన్‌షాపు కోసం సగటున 34 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2025–27 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని 2,620 వైన్ (ఏ4) షాపుల నిర్వహణ కోసం లైసెన్సులు మంజూరు చేసేందుకు తొలి విడత గడువు ముగిసే సమయానికి మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారికంగా వెల్లడించింది. తద్వారా దరఖాస్తు ఫీజు రూపంలో మొత్తం రూ.2,680 కోట్లు సమకూరింది. ఇది గత రెండేళ్ల కాలానికి దరఖాస్తు ఫీజు రూపంలో వచ్చిన దాని కంటే కొంచెం ఎక్కువ కావడం గమనార్హం.
కాగా, ఈ దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ మరో మూడు రోజులు పెంచింది. ఈనెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 23న జరగాల్సిన డ్రాలు ఈనెల 27న తీస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అత్యధికంగా శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 8 వేలకు పైగా వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో కేవలం 622 దరఖాస్తులు మాత్రమే రాగా, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,620 దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఎక్సైజ్ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలివి..
ఆదిలాబాద్ (711), ఆసిఫాబాద్ (622), మంచిర్యాల (1,617), నిర్మల్ (942), హైదరాబాద్ (2,960), సికింద్రాబాద్ (2,787), జగిత్యాల (1,834), కరీంనగర్ (2,635), పెద్దపల్లి (1,378), సిరిసిల్ల (1,324), ఖమ్మం (4,094), కొత్తగూడెం (3,799), గద్వాల (723), మహబూబ్‌నగర్ (2,360), నాగర్‌కర్నూల్ (1,424), వనపర్తి (676), మెదక్ (1,369), సంగారెడ్డి (4,190), సిద్దిపేట (2,642), నల్లగొండ (4,620), సూర్యాపేట (2,617), భువనగిరి (2,649), కామారెడ్డి (1,444), నిజామాబాద్ (2,633), మల్కాజ్‌గిరి (4,879), మేడ్చల్ (5,203), సరూర్‌నగర్ (7,595), శంషాబాద్ (8,110), వికారాబాద్ (1,750), జనగామ (1,588), భూపాలపల్లి (1,658), మహబూబాబాద్ (1,674), వరంగల్ రూరల్ (1,825), వరంగల్ అర్బన్ (3,012).