
హత్యా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఎస్సీ రాహుల్‌దేవ్ సింగ్
గంగవరం (తూర్పు గోదావరి) : మద్యం తాగి భార్యాబిడ్డలను వేధిస్తున్న భర్త హత్యకు గురైన సంఘటన గంగవరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం జరగగా శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన వివరాలను రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ స్థానిక విలేకర్లకు శుక్రవారం సాయంత్రం వివరించారు. పాత గంగవరం గ్రామానికి చెందిన కంగల కృష్ణమూర్తి దొర (40)అనే వ్యక్తి రోజూ మద్యం సేవించి భార్యబిడ్డలను హింసిస్తున్నాడన్నారు. గురువారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తిదొర భార్య పిల్లలతో ఘర్షణకు దిగాడన్నారు. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తిదొర భార్య వరలక్ష్మి మధ్య తీవ్ర ఘర్షణకు దిగడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ సమయంలో కృష్ణమూర్తిదొర మెడలో ఉన్న తువాళ్లను భార్య గట్టిగా తిప్పేయడంతో ఊపిరాడక కృష్ణమూర్తి మృతి చెందినట్టు ఏఎస్పీ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య కేసుగా నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు.
హత్యా స్థలాన్ని ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్, సీఐ గౌరీశంకర్ పరిశీలించి విచారణ చేశారు. అడ్డతీగల సీఐ గౌరీశంకర్ మాట్లాడుతూ గంగవరం వీఆర్వో ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశామన్నారు. ఈ కేసును రంపచోడవరం ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సీఐ వివరించారు. ఈ సంఘటనతో కృష్ణమూర్తి దొర ఇద్దరు బిడ్డలు అనాథలుగా మిగిలారు. కంగల అరవింద్ టెన్త్ పాస్ కాగా, కుమార్తె కంగల అనూష 8వ తరగతి అభ్యసిస్తోంది. వీరిద్దరూ రంపచోడవరం గురుకుల పాఠశాలల్లోనే చదువుతున్నారు. ఈ ఘటనపై బంధువులు, గ్రామస్తులు ఎవ్వరూ నోరువిప్పడం లేదు.