చికెన్‌లో ఎలుకల మందు కలిపి..

Wife And Daughter Killed Husband in Hyderbad - Sakshi

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

సహకరించిన కుమార్తె ఇద్దరు నిందితుల అరెస్ట్‌

కీసర: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన కేసులో కీసర పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  ఒడిస్సాకు  చెందిన బీర వసంత్‌(40) చాలా కాలం క్రితం నగరానికి వలస వచ్చి భార్య రేణుకతో కలిసి రాజీవ్‌గృహాకల్పలో ఉంటూ  టెంట్‌హౌస్‌లో కూలీగా పని చేస్తున్నాడు. రేణుక గ్యాస్‌ గోదాంలో పనిచేసేది. వారికి ఇద్దరు సంతానం. భార్యా, భర్తలిద్దరూ తరచూ మద్యం తాగి గొడవపడేవారు  ఈ నేపథ్యంలో రేణుకకు గ్యాస్‌ గోదాంలో తనతో పాటు పని చేస్తున్న కిషోర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

  ప్రియుడి మోజులో పడిన  రేణుక ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది.  ఇందుకు తన కుమార్తె (13) సహకారం కోరింది.  తల్లి సూచనమేరకు ఈనెల 13న కుమార్తె చికెన్‌లో ఎలుకల మందు  కలిపి తండ్రి వసంత్‌కు పెట్టింది. దీనిని పసిగట్టిన వసంత్‌ చికెన్‌ను బయట పారవేశాడు. రాత్రి మద్యం తాగి నిద్రిస్తున్న వసంత్‌ను రేణుక తన ప్రియుడు కిషోర్, కుమార్తెతో కలిసి చున్నీతో మెడకు భిగించి హత్య చేశారు.అనంతరం అతిగా మద్యం తాగినందునే  చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు.  మరుసటి రోజు ఉదయం  మృతదేహాన్ని  అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో హత్య చేసినట్లు నిర్ధారణైంది.  హత్యకు వినియోగించిన చున్నీ, టవల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు రేణుక, కిషోర్‌ను రిమాండ్‌కు తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top