ఏవండీ.. ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి | Insurance Affair Murder Plot Exposed in Mancherial | Sakshi
Sakshi News home page

ఏవండీ.. ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి

May 27 2026 8:04 AM | Updated on May 27 2026 8:51 AM

Insurance Affair Murder Plot Exposed in Mancherial

కుటుంబంలో కలతలు… సంబంధాల్లో మలుపులు… డబ్బుపై ఆశతో వేసిన ఒక పక్కా స్కెచ్‌ చివరికి ఓ దారుణ హత్యకు దారి తీసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భర్త చావును సహజ మరణంగా చూపించి కోట్ల రూపాయల బీమా సొమ్ము దక్కించుకోవాలన్న ఆ భార్య ప్లాన్‌ పోలీసుల దర్యాప్తుతో బెడిసి కొట్టింది. పైగా వివాహేతర సంబంధం మోజులోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

మంచిర్యాల పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ జంటకు పెళ్లై చాలా కాలం అయ్యి పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే కొంతకాలంగా భార్య భర్తపై ఎప్పుడూ లేనంత ప్రేమ కురిపిస్తూ వచ్చింది. బయటకు అది ఆప్యాయతలాగే కనిపించినా… ఆ ప్రేమ ముసుగు వెనుక కుట్ర దాగి ఉందని ఆ భర్త పసిగట్టలేకపోయాడు.

అయితే అప్పటికే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్న సదరు మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించేందుకు ప్లాన్‌ వేసింది. ఈ క్రమంలోనే ఓ సుపారీ గ్యాంగ్‌కు రూ.10 లక్షలిచ్చి డీల్‌ మాట్లాడుకుంది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి సహజ మరణంగా చూపించాలనుకుంది. తద్వారా భర్త పేరు మీద ఉన్న రూ.3 కోట్ల విలువైన ఇన్సూరెన్స్‌లు రాబట్టాలనుకుంది. 

అయితే ఎంత కవర్‌ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ.. భర్త బంధువులకు అనుమానాలు పెరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. సాంకేతిక ఆధారాలు, కాల్‌డేటా, ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించాయి. ప్లాన్‌ప్రకారం భర్తను చంపే ఉద్దేశంతోనే ఆమె.. అతని పేరి మీదట ఇన్సూరెన్స్‌లు తీయించినట్లు తేలింది. భార్యను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొత్తం కుట్రలో మరెవరి పాత్ర ఉందన్న కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ ప్రెస్‌మీట్‌లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement