భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది! | Rajasthan Ajmer Ex Sarpanch Case Shocking Details | Sakshi
Sakshi News home page

భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది!

May 30 2026 2:00 PM | Updated on May 30 2026 2:23 PM

Rajasthan Ajmer Ex Sarpanch Case Shocking Details

రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్‌ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. 

మృతులను మాజీ సర్పంచ్‌ రామ్‌సింగ్‌ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్‌ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.

ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్‌సింగ్‌ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్‌తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్‌ఫార్మెన్స్‌పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.

అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్‌మెంట్‌ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్‌సింగ్‌ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు,  ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అసలు విషయం బయటపడింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్‌సింగ్‌కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్‌ కొడుకు కలిసి.. తొలుత రామ్‌సింగ్‌ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్‌సింగ్‌ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.

అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్‌ ఆధారాలు, మొబైల్‌ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్‌ ఎస్పీ హర్షవర్ధన్‌ అగర్వాల్‌ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.

ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్‌కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. 

నెలల తరబడి ఎదురు చూసి..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్‌ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement