ఆత్మహత్య కాదు.. హత్యే 

Visakha Police Solved The Suicide Case - Sakshi

ఏయూలో ఉద్యోగం కోసం కుట్ర 

తల్లి, సోదరి, బావమరిదే నిందితులు 

ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు 

వివరాలు వెల్లడించిన త్రీటౌన్‌ సీఐ రామారావు  

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): చినవాల్తేరులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసును ఎట్టకేలకు త్రీటౌన్‌ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో ఇది ఆత్మహత్య కాదు.. హత్యేనని తేల్చారు. మద్యం మత్తులో నిత్యం వేధించడం.. ఆయన చనిపోతే ఏయూలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో కుటుంబ సభ్యులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని నిర్ధారించారు. ఈ మేరకు పెదవాల్తేరులోని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సీఐ కోరాడ రామారావు కేసు వివరాలను వెల్లడించారు.

 ఆంధ్రా యూనివర్సిటీలో పంప్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఒమ్మి పోలారావు(32) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈయన తల్లి వరలక్షి్మ, భార్య లావణ్య, పిల్లలతో కలిసి చినవాల్తేరు పాత సీబీఐ డౌన్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగానే గత శనివారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి, తలుపుల అద్దాలు పగలుగొట్టాడు. కుటుంబ సభ్యులను కూడా కొట్టడంతో వారంతా దగ్గరలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి మెడపై గాజుపెంకుతో పొడుచుకుని పోలారావు చనిపోయి ఉన్నాడని తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో తల్లి ఒమ్మి వరలక్ష్మి (55), సోదరి అల్లు వెంకటలక్ష్మి(33), బావమరిది అల్లు కిశోర్‌(35) చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిరనట్టు తేలిందని సీఐ తెలిపారు. మద్యం మత్తులో నిత్యం కుటుంబ సభ్యులను వేధించడంతో వారంతా సహనం కోల్పోయారన్నారు. అలాగే పోలారావు చనిపోతే ఏయూలో ఉద్యోగం కుటుంబంలో సోదరికి వస్తుందన్న ఆశతో హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద పోలారావుకు ఏయూలో ఉద్యోగం వచ్చిందని, ఈ క్రమంలో మృతుడి వైఖరితో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఏయూలో ఉద్యోగం కోసం ఆయన మెడపై గాజుపెంకులతో పొడిచి హత్య చేశారని తేలిందని సీఐ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు జె.ధర్మేంద్ర, షేక్‌ఖాదర్‌బాషా, ఏఎస్‌ఐ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top