వెటర్నరీ డాక్టర్‌ ఆత్మహత్య

Veterinary Doctor Commits Suicide in Tamil Nadu - Sakshi

అధికారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపణ

విధుల్లో చేరిన రెండు నెలలకే  యువ డాక్టర్‌ బలవన్మరణం

పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్‌ను తొలగించాలని వైద్యులు, బంధువుల ధర్నా

చెన్నై, పళ్లిపట్టు: అధికారి వేధింపులతో వెటర్నరీ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్కేపేటలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. పళ్లిపట్టు తాలూకా ఆర్కేపేట మహాన్‌కాలికాపురం గ్రామానికి చెందిన రామచంద్రన్‌ కుమారుడు శివ(28). ఇతను బాలాపురంలోని ప్రభుత్వ పశు వైద్య కేంద్రంలో రెండు మాసాల కిందట వైద్యుడిగా విధుల్లో చేరాడు. బుధవారం విధులకు హాజరై సాయంత్రం ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబీకులు దిగ్భ్రాంతి చెందారు. విధుల్లో ఒత్తిడి, సహాయ డైరెక్టర్‌ మహేంద్రన్‌ నుంచి నిరంతరం వేధింపులు తాళలేక శివ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన బందువులు ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రమేష్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బంధువుల రాస్తారోకో: వెటర్నరీ డాక్టర్‌ ఆత్మహత్యకు తిరుత్తణి పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్‌ మహేంద్రన్‌ కారణమని ఆరోపిస్తూ ఆయనను తొలగించాలని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ప్రధాన రోడ్డుపై బంధువులు గురువారం రాస్తారోకో చేశారు. దీంతో ఆ మార్గంలో వాహన సేవలు స్తంభించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. న్యాయం చేస్తామని హామీతో రాస్తారోకో విరమించారు.

వైద్య సిబ్బంది ధర్నా:తమిళనాడు పశు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తిరుత్తణి పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నుంచి వందకు పైగా వైద్యులు విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనిగైవేలు అధ్యక్షత వహించారు. వైద్యుల పట్ల చిన్న చూపు ప్రదర్శించి తీవ్ర ఒత్తిడికి గురిచేసిన పశువైద్య సహాయ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశౠరు. వెంటనే అరెస్ట్‌ చేసి వైద్యులకు భద్రత కల్పించాలన్నారు. ధర్నాలో తిరుత్తణి సబ్‌ డివిజన్‌ కార్యదర్శి దామోదరన్, వైద్యులు పాల్గొన్నారు.

అధికారిపై చర్యలు తీసుకుంటాం: జాయింట్‌ డైరెక్టర్‌
వెటర్నరీ డాక్టర్‌ ఆత్మహత్యకు సంబంధించి బంధువుల ఆరోపణల ఆధారంగా విచారణ చేపట్టి తిరుత్తణి పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ అదనపు డైరెక్టర్‌ కుబేంద్రన్‌ తిరుత్తణిలో విలేకరులకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top