ఆగని అకృత్యాలు.. వసివాడుతున్న పసిమొగ్గలు | Two Minor Girls Assault And Murder In Chhattisgarh And UP In A Wedding | Sakshi
Sakshi News home page

ఆగని అకృత్యాలు.. వసివాడుతున్న పసిమొగ్గలు

Apr 20 2018 5:47 PM | Updated on Aug 25 2018 4:14 PM

Two Minor Girls Assault And Murder In Chhattisgarh And UP In A Wedding - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో/రాయ్‌పూర్‌ : కథువా, ఉన్నావో సంఘటనలతో ఓవైపు దేశమంతా అట్టుడికిపోతుంటే మరోవైపు బాలలపై జరిగే లైంగిక నేరాలు మాత్రం తగ్గటంలేదు. తాజాగా ఇలాంటివే మరో రెండు సంఘటనలు వెలుగుచూశాయి.  ఈ రెండు ఘటనలు రెండు వేర్వేరు రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గడ్‌లో ఓ వివాహానికి హజరైన పదకొండేళ్ల బాలికపై అదే వేడుకకు వచ్చిన ఓ పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కబీర్‌ధామ్‌ జిల్లాలోజరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తమ్‌ సాహూ(25) అనే వ్యక్తి పెళ్లి కుమారుడు తరుపు బంధువు. సాహూ ఇదే వివాహానికి వచ్చిన ఓ పదకొండేళ్ల​ బాలికకు మాయ మాటలు చెప్పి ఊరవతలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తలపై బండతో మోదీ చంపేశాడు. కాసేపటి తరువాత వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. గురువారం ఉదయం బాలిక మృతదేహం ఒక కాలువ దగ్గర కనిపించింది. బాలిక చివరిసారిగా సాహూతో కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని విచారించగా తానే బాలికపై అత్యాచారం చేసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు.  నిందితుడిపై అత్యాచార, హత్యా నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి లాల్‌ ఉమెద్‌ సింగ్‌ తెలిపారు.

ఇటువంటి సంఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు వివరాల ప్రకారం బాధిత బాలిక ఎటాలో ఓ పెళ్లికి హజరవ్వడానికి వచ్చింది. అదే వేడుకకు వంటలు చేయడానికి వచ్చిన పింటూ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పింటూపై కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement