ఆటోను ఢీకొన్న క్వారీ ట్రాక్టర్‌

Two Dies In Road Accident In Srikakulam - Sakshi

ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

ముగ్గురి పరిస్థితి విషమం

రెడ్డిపేట సమీపంలో ఘటన

పొందూరు : లోలుగు పరిధిలోని రెడ్డిపేట సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..పొందూరు మండలం జాడపేట(మలకాం) గ్రామానికి చెందిన జాడ కాంతమ్మ మనుమరాలు వెంకటలక్ష్మి శ్రీకాకుళంలో ఉంటున్నారు. వెంకటలక్ష్మి గర్భిణి. ఈమెను చూసేందుకు గ్రామానికి చెందిన తొమ్మిది మంది బుధవారం శ్రీకాకుళం వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో అదే గ్రామానికి చెందిన జలగం పైడిరాజు ఆటోను బుక్‌ చేసుకున్నారు. ఆటో లోలుగు గ్రామం దాటి రెడ్డిపేట వద్దకు వెళ్తుండగా ఎదురుగా చిలకపాలెం వైపు అధిక లోడుతో వస్తున్న క్వారీ ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ట్రాక్టర్‌ రాంగ్‌ రూట్‌లో రావడంతో ఆటోడ్రైవర్‌కు తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న జాడ భాగ్యలక్ష్మి(40), కిళ్లారి అనూరాధ(18) అక్కడికక్కడే మృతి చెందారు.

జాడ వెంకటరమణ, జాడ కాంతమ్మ, జాడ అప్పలనాయుడు, జాడ సత్తెమ్మ, జాడ కన్నమ్మ, జాడ రమణమ్మ, జాడ పైడిరాజు, జాడ మాధురిలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వారిలో జాడ రమణమ్మ, ఆటో డ్రైవర్‌ జాడ పైడిరాజు, జాడ మాధురిల పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సంఘటన స్థలంలో మృతులు, క్షతగాత్రులు కుటుంబాల రోదనలు మిన్నంటాయి. జాడ భాగ్యలక్ష్మి మృతి చెందడంతో భర్త శ్రీనివాసరావు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అనూరాధ స్థానిక సిస్టం కళాశాలలో డిగ్రీ సెకెండియర్‌ చదువుతోంది. కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్‌లు బోరున విలపించారు. డీఎస్పీ భీమారావు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ బాలరాజులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్సం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలుడి డ్రైవింగే కారణమా..?

క్వారీ ట్రాక్టర్‌ను మైనర్‌ బాలుడు డ్రైవ్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అధిక లోడును ఎక్కించుకొని అతివేగంతో నడుపుతున్నాడని, ఈ విషయమై కేకలు వేసినా వేగం తగ్గించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. లైసెన్స్‌ కూడా  ఉండకపోవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్వారీ, క్రషర్‌లలో చాలామంది డ్రైవర్లకు లైసెన్సులు లేకపోవడం, బాలురు డ్రైవింగ్‌ చేస్తున్నా పట్టించుకోకవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top