స్నేహితుడి వివాహానికి వెళ్తూ..

Two Close Friends Died In Lorry Accident Warangal - Sakshi

బచ్చన్నపేట : స్నేహితుని వివాహానికి బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండల  మొండికుంట వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో డాక్యుమెంటరీ పని చేసే ప్రణీత్‌ ఆలియాస్‌ సన్నీ వివాహం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతోంది. పెండ్లికి వెళ్లేందుకు మిత్రులు  రవికిరణ్‌రెడ్డి(24), ఎలిశెట్టి కర్ణాకర్‌(26) బైక్‌పై బయలుదేరారు. బైక్‌ మొండికుంట స్టేజీ వద్దకు చేరుకోగానే మహారాష్ట్రకు చెందిన లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో స్నేహితులిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

పది రోజుల్లో ఉద్యోగం వచ్చేది..
రవికిరణ్‌రెడ్డి తండ్రి మధుమోహన్‌రెడ్డి సేల్‌టాక్స్‌ కార్యాలయంలో పని చేస్తూ చనిపోయాడు. కూతురు, కుమారున్ని తల్లి తార జనగామలో టైలర్‌ షాపు పెట్టుకొని బట్టలు కుడుతూ చదివిస్తోంది. పది రోజుల్లో రవికిరణ్‌రెడ్డి తండ్రి జాబ్‌లో చేరేవాడని, ఇక తమ కష్టాలు తీరేవని తల్లి తార రోదిస్తూ తెలిపింది. ప్రస్తుతం కూతురు బీటెక్‌ చదువుతోంది. ఇంటికి ఇద్దరూ పెద్ద దిక్కులు పోయి కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చిందని పలువు రోదించారు.
 
కొడుకు, భార్య అనాథ..
 రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన కర్ణాకర్‌ వాయిస్‌ టుడే న్యూస్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. మృతునికి రెండు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వారికి  తొమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. మృతుని తండ్రి యాదగిరి, తల్లి కోమలకు వివాహానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అరగంట లోపు చనిపోయాడని సమాచారం వచ్చిందని భార్య అశ్విని రోదనలు మిన్నంటాయి. 

కళ్ల ముందే విగతజీవులుగా..
బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టిందని వారి వెనకాలే వెళ్తున్న వరంగల్‌కు చెందిన మరో స్నేహితుడు సచిన్‌ చెబుతున్నాడు. ఆ లారీ వేగానికి తమ బైక్‌ను పక్కకు ఆపామని, కొంత దూరం వెళ్లి లారీ ప్రమాదం జరగడంతో ఆగిందని వివరించాడు. ఎస్సై రంజిత్‌రావు ఘటనా స్థలానికి ఎస్సై రంజిత్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top