గొంతుకోసి.. గుండెల్లో పొడిచి.. | Two Brothers Was killed At Nizamabad | Sakshi
Sakshi News home page

Jul 22 2018 2:19 AM | Updated on Oct 17 2018 6:10 PM

Two Brothers Was killed At Nizamabad - Sakshi

నిజామాబాద్‌ క్రైం : నిజామాబాద్‌ నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. పాత కక్షలతో అన్నదమ్ములైన ఇద్దరు యువకులను నడిరోడ్డుపై తల్వార్‌లతో దాడి చేసి దారుణంగా హత్య చేయడంతో కలకలం రేగింది. హమాల్‌వాడీకి చెందిన అన్నదమ్ములైన బద్రి పవన్‌ కల్యాణ్‌ యాదవ్‌ అలియాస్‌ బబ్లూ (30), నర్సింగ్‌ యాదవ్‌ అలియాస్‌ కన్నా (28 )లను మరో ఇద్దరు యువకులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. నగరంలోని మూడో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్‌ యాదవ్‌ ఛాతీపై దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

పవన్‌ గొంతులో పొడవడంతో ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అతన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ప్రేమ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా అతనిపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రేమ్‌కుమార్‌కు తలకు గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకుని సమీపంలోని త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు సమాచారాన్ని అందజేశాడు. ఈ దారుణానికి పాల్పడింది హమాల్‌వాడీకి చెందిన తల్వార్‌ సాయి, రంజిత్‌లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తల్వార్‌సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పాత కక్షలే కారణం 
పాత కక్షలతో ఈ యువకులిద్దరూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా గొడవలు జరిగాయి. గతంలో ఓ పుట్టినరోజు వేడుకలో, మరోమారు క్రికెట్‌ బెట్టింగ్‌ విషయంలో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ రెండు గ్యాంగ్‌లు ఇప్పటికే పలుమార్లు గొడవలు పడి పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడినట్టు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ కక్షలు ఏకంగా ఇద్దరు యువకుల ప్రాణాల మీదికి తెచ్చినట్లయింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement