మోడల్‌తో ప్రేమాయణం..తరచు విదేశీయానం | Twists in Thief Irfan Robbery Cases Hyderabad | Sakshi
Sakshi News home page

మోడల్‌తో ప్రేమాయణం..తరచు విదేశీయానం

Nov 11 2019 12:33 PM | Updated on Nov 11 2019 12:33 PM

Twists in Thief Irfan Robbery Cases Hyderabad - Sakshi

ఘరానా దొంగ ఇర్ఫాన్‌

ఇదీ ఘరానా దొంగ ఇర్ఫాన్‌ లైఫ్‌స్టై

బంజారాహిల్స్‌: బెంజ్‌ కారులో షికారు, ఓ మోడల్‌తో ప్రేమాయణం, తరచూ ఆమెతో కలిసి ఫారిన్‌ టూర్లు ఇదీ ఘరానా దొంగ లైఫ్‌ స్టైల్‌. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో సంపన్నుల నివాసాలను టార్గెట్‌ చేసుకొని రూ. కోట్లు విలువైన వజ్రాభరణాలు దొంగిలించిన కేసులో నిందితుడు, బీహార్‌కు చెందిన ఘరానా దొంగ ఇర్ఫాన్‌ను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మూడురోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడు వెల్లడించిన వివరాలతో పోలీసులు అవాక్కయ్యారు.    జూబ్లీహిల్స్‌లో 1, బంజారాహిల్స్‌లో 3 ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. బంజారాహిల్స్‌లోనే మరో ఇంట్లో చోరీకి యత్నించినట్లు తెలిపాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇతను ఖరీదైన కార్లలో తిరుగుతూ సంపన్నులు నివాసం ఉంటున్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొల్లగొట్టేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నెల రోజుల క్రితం బెంగళూరు పోలీసులు ఇర్ఫాన్‌ ముఠాను అరెస్టు చేసిన విషయం విదితమే.. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. అనంతరం మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఈ ముఠా పంజా విసిరినట్లుగా తేలింది. ముంబైలో గత నెలలో బెంగళూరు పోలీసులకు చిక్కిన ఇర్ఫాన్‌తో పాటు అతడి డ్రైవర్‌ మారుఫ్‌ను కూడా పోలీసులు విచారించారు. వీరిచ్చిన సమాచారంతో నగరంలోని తలాబ్‌కట్టలో వీరికి ఆశ్రయం కల్పించిన ముజఫర్, షాహిద్‌లను అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు బంగారాన్ని కొనుగోలు చేసిన ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారులు అంకుర్, రమేష్‌జోషి, షావిజయలక్ష్మి చంద్, రవీంద్రలను కూడా అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో రూ.2కోట్లకు పైగా వజ్రాలను చోరీ  కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. చోరీ చేసిన సొమ్ములో కొంత తన స్వగ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఓ మోడల్‌ను ప్రేమిస్తున్నానని, ఆమెతో కలిసి తరచూ గోవాతో పాటు విదేశాల్లో పర్యటించినట్లు తెలిపారు. తాను దొంగతనాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా బెంజ్‌ కారులో ప్రయాణిస్తానని.. అలా అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని వెల్లడించారు. సెలబ్రిటీస్‌ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిన ఇర్ఫాన్‌ చేసిన దొంగతనాలన్నీ సినీ ఫక్కీలోనే ఉంటాయని దర్యాప్తులో తేలింది. చేతివేళ్లకు ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, సూటూ బూటు వేసుకొని బెంజ్‌కారులోనే డ్రైవర్‌ మారుఫ్‌తో కలిసి తిరుగుతుంటాడు. ప్రతి నగరంలోనూ తనకు ఆశ్రయం ఇచ్చే వారిని ముందుగానే సిద్ధం చేసుకుంటానని వెల్లడించాడు. ఢిల్లీ, ముంబై నగరాల్లోనే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపాడు. ఆయన లైఫ్‌స్టైల్‌ను తెలుసుకున్న పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. సమాజంలో ధనికుడిగా చలామణి అవుతూ పోలీసుల నిఘా నుంచి తప్పించుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement