
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్.. తన కారు డ్రైవర్..వ్యాపార భాగస్వామిని వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్,పార్టనర్ ఇద్దరు కలిసి వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్‌పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్‌పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్ వాహనం ఢీకొట్టింది.
వెంటనే మెరుపు వేగంతో రాకేష్ అగర్వాల్ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.
దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్‌లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్ డమ్మీదని గుర్తించారు. నెంబర్ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.