కెనడా పేరుతో బ్యాంకాక్‌కు!

Three Arrest In Visa Procesing Case - Sakshi

వీసా ప్రాసెసింగ్‌ పేరుతో తీసుకెళ్లిన ముఠా

రూ.మూడు లక్షలు కాజేసి మోసం చేసిన వైనం

ముగ్గురి అరెస్టు  

సాక్షి,సిటీబ్యూరో: ఉద్యోగ వీసాపై కెనడా వెళ్లాల ని భావించిన నగర వాసిని ఉత్తరాదికి చెందిన ముఠా నిలువునా ముంచింది. ఇతడిని బ్యాంకాక్‌ కు తీసుకెళ్లి రూ.3 లక్షలు కాజేసింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు తిరిగి వచ్చి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహం తి సోమవారం పేర్కొన్నారు. చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్‌ యాకూబ్‌ కెనడాలో ఉద్యోగం చేయాలని భావించాడు. ఇందుకోసం తన ప్రొఫైల్‌ను నౌకరీ.కామ్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. దీని ద్వారా యాకూబ్‌ వివరాలు సంగ్రహించిన సైబర్‌ నేరగాళ్లు అతడికి ఫోన్‌ చేశారు. మూడు వేర్వేరు సెల్‌ఫోన్‌ నెంబర్ల నుంచి నేహ, రీత, అర్పిత, జాహ్నవి అనే చెప్పుకున్న యువతులు వరుసగా మాట్లాడారు. నౌకరీ.కామ్‌లో మీ ప్రొఫైల్‌ చూశామని, కెనడాకు కచ్చితంగా వీసా ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో భారత్‌ నుంచి సాధ్యం కావట్లేదని, బ్యాంకాక్‌కు వస్తే అక్కడ నుంచి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతడి మాటలు నమ్మిన యాకూబ్‌ బ్యాంకాక్‌కు ఫ్లైట్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు ఆ వివరాలను సైబర్‌ నేరగాళ్లకు పంపాడు.

బ్యాంకాక్‌లో దిగిన బాధితుడు అక్కడ విజిట్‌ వీసా తీసుకున్నాడు. విమానాశ్రయంలో యాకూబ్‌ను కలుసుకున్న ఓ యువతి హోటల్‌ రూమ్‌కు తీసుకువెళ్లింది. తాము కెనడా వీసా ప్రాసెసింగ్‌ చేస్తున్నామంటూ యాకూబ్‌ నుంచి అతడి పాస్‌పోర్ట్‌ సైతం తీసుకువెళ్ళింది. కొన్ని రోజులకు వాట్సాప్‌ ద్వారా బాధితుడిని సంప్రదించిన సదరు యువతి వీసా ప్రాసెసింగ్‌ పూర్తయిందని, తమకు రూ.3 లక్షలు చెల్లించాలని చెప్పింది. వాట్సాప్‌ ద్వారానే వీసా పేపర్లు సైతం పంపింది. దీనిని నమ్మిన అతను తరుణ్‌జీత్‌ కౌర్‌ పేరుతో ఉన్న ఖాతాలోకి నగదు బదిలీ చేశాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఓ యువతి యాకూబ్‌ పాస్‌పోర్ట్‌ను ఓ కవర్‌లో పెట్టి ఆయన బస చేసిన హోటల్‌ రిసెప్షన్‌లో ఇచ్చి వెళ్లింది. హోటల్‌ సిబ్బంది ద్వారా కవర్‌ అందుకున్న యాకూబ్‌ అందులో పాస్‌పోర్ట్‌ ఉన్నప్పటికీ వీసాకు సంబంధించిన పేపర్లు చింపేసినట్లు గుర్తించాడు. సైబర్‌ మోసగాళ్లను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. సిటీకి తిరిగి వచ్చి సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై కృష్ణ, కానిస్టేబుళ్ళు మురారి, మహేష్, సతీష్‌ దర్యాప్తు చేశారు. యాకూబ్‌ డబ్బు డిపాజిట్‌ చేసిన బ్యాంకు వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. ఉత్తరాదికి వెళ్ళిన ప్రత్యేక బృందం నోయిడా, హర్యానాలో కునాల్, వినయ్, తరుణ్‌జీత్‌ కౌర్‌లను పట్టుకుంది. ఈ ముగ్గురు నిందితుల్నీ అక్కడి న్యాయస్థానాల్లో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top