నగరంలో భారీ చోరీ 

Thieves Steal Rs 6 Lakhs And 320 Grams Gold In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  నగరంలోని కత్తెరవీధిలో నివాసమంటున్న వాండ్రంగి శ్రీనివాసరావు ఇంట్లో శనివారం రాత్రి దొంగలుపడ్డారు. 32 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదు, మూడు తులాల వెండి దోచుకెళ్లారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం పూరీ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారం, నగదు, వెండిని తీసుకెళ్లారు. అయితే ఇంటి పైభాగంలో శ్రీనివాసరావు తల్లి దమయంతి నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి ముందు ఓ వ్యక్తి ఉండడాన్ని దమయంతి గమనించి, ఎవరని ప్రశ్నించారు. తన కుమారుడు కాపలా ఉండమని చెప్పారా అని అడిగారు. దీంతో ఆ వ్యక్తి అవునని సమాధానం ఇచ్చాడు.  ఉదయం 6 గంటల సమయంలో పాలు ఇచ్చేందుకు వచ్చిన మహిళ  ఇంటి తాళాలు తీసి, లైట్లు వేసి ఉండడం గమనించి, విషయాన్ని శ్రీనివాసరావు తల్లి దమయంతికి తెలియజేశారు.  ఇంట్లో చిందరవందరగా వస్తువులు, బీరువా తెరిచి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు హుటాహుటిన శ్రీకాకుళం చేరుకున్నారు.   

పోలీసుల పరిశీలన 
సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ చక్రవర్తి, సీసీఎస్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శంకరరావు పరిశీలించారు. క్లూస్‌ టీం వేలిముద్రలను, ఆధారాలను సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. కత్తెర వీధి నుంచి గొంటి వీధి వరకు వెళ్లి అక్కడ ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద పోలీసు డాగ్‌ ఆగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాసరావు లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, దమయంతి ఫిర్యాదు మేరకు సీఐ శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top