బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్‌

Theives Target Was Passengers Who Are Waiting In  Razam Bus Station  - Sakshi

సాక్షి, రాజాం : బస్టాండ్‌లే వారికి ఆదాయ మార్గాలు. ఒంటరిగా బస్సు ఎక్కేవారే టార్గెట్‌. రద్దీగా ఉండే బస్సుల్లో ఎక్కేవారి చేతుల్లో ఉండే బ్యాగులు, నగదు కాజేయడంలో సిద్ధహస్తులు. ఇలా ఈ మధ్య కాలంలో రాజాం బస్టాండ్‌లో ఓ వ్యక్తి సంచిలో నుంచి దొంగిలించి పరారైన నిందితులను పోలీసులు చాకచక్యంగా బుధవారం పట్టుకున్నారు. రాజాం ఎస్‌ఐ కె.రాము నిందితులను విలేకరుల ముందు హాజరు పరిచి, వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న విజయవాడకు చెందిన బట్టల వ్యాపారి పడాల నాగేశ్వరరావు రాజాంలో తన సొమ్ము కలెక్షన్‌ చేసుకుని, తిరుగు పయనమయ్యాడు.

సాయంత్రం 6 గంటల సమయంలో విశాఖపట్నం బస్సు ఎక్కుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి వ్యాపారిని తత్తరపాటుకు గురిచేసి, చేతిలో ఉన్న బ్యాగును చాకచక్యంగా కాజేసి పరారయ్యారు. తేరుకున్ను నాగేశ్వరరావు.. తన బ్యాగులోని రూ.86,250లు అపరహరణకు గురయ్యాయని రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, రంగంలోకి దిగిన పోలీసులు.. కాంప్లెక్స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించి, పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు.

ఈ నేపథ్యంలో బుధవారం బస్టాండ్‌లో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ కె.రాము, క్రైం సిబ్బంది సీహెచ్‌ కృష్ణ, చౌదరి కృష్ణ, శంకరరావు బస్టాండ్‌కు చేరుకొని, చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నంకు చెందిన బుర్లి సురేష్‌ప్రసాద్, గోపాలపట్నంకు చెందిన అరికట్ల తారకేశ్వరరావుగా గుర్తించి, మరిన్ని వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వీరి వద్ద నుంచి రూ.84,200లు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించామని ఎస్‌ఐ వివరించారు. గతంలో విశాఖపట్నంలో కూడా వీరిపై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top