9 నెలల క్రితం అదృశ్యం.. 6 నెలల గర్భిణిగా ప్రత్యక్షం

A Teacher Who Cheated On A Minor Girl With Name Of Love - Sakshi

సాక్షి, గిద్దలూరు:  పాఠాలు నేర్పాల్సిన గురువు మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచించి తనతో తీసుకెళ్లాడు. ఆమెను శారీరకంగా వాడుకుని ఇప్పుడు గర్భవతిని చేశాడు. ఈ సంఘటన 9 నెలల క్రితం జరిగింది. అప్పట్లో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్‌ కేసు నమో దు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండా వదిలేశారు. దీంతో బాలికను తీసుకెళ్లిన యువకుడు సికింద్రాబాద్‌ నగరంలో ఓ గదిని అద్దెకు తీసుకుని భార్యా, భర్తల్లా కాపురం చేశారు. ఫలితంగా ఆ బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయ్యింది. పాఠశాలలో చదువుకోవాల్సిన ఆ బాలిక గర్భవతిగా వైద్యశాలలో చికిత్స పొందుతోంది.

అందిన సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ఆదిమూర్తిపల్లె గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక వైఎస్సార్‌ జిల్లాలోని కలసపాడు మండలంలో గల ఓ పాఠశాలలో 2017–2018లో 10వ తరగతి చదువుకుంది. గతేడాది తిరుపతిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ చదువుకుంటూ దసరా సెలవులకు స్వగ్రామం ఆదిమూర్తిపల్లికి వచ్చింది. బాలిక కలసపాడులోని పాఠశాలలో పదోతరగతి చదువుతున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రైవేటు ఉపాద్యాయుడు అదే జిల్లాలోని రామాపురంకు చెందిన ఉపాధ్యాయుడు (బొమ్ము వీరయ్య) బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. మాయమాటలతో ప్రేమించానంటూ నమ్మించాడు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారాలు జరిగినట్లు సమాచారం. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి తన స్నేహితుని సహకారంతో ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 

అక్టోబర్‌ 14నే పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి...
దసరా సెలవులకు వచ్చిన తన కుమార్తె గతేడాది అక్టోబర్‌ 14వ తేదీన కనిపించకుండా పోయింది. తనతో పాటు ఇంట్లో ఉన్న 32తులాల బంగారు ఆభరణాలు, రూ.65వేలు నగదు తీసుకెళ్లారు. దీంతో బాలిక తల్లి ఆదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ఆలస్యం చేశారు. కొన్ని రోజుల తర్వాత కేసును పట్టించుకోకుండా పూర్తిగా వదిలేశారు. ఇదే అదునుగా భావించిన సదరు యువకుడు బాలికను శారీరకంగా లోబరుచుకుని గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతిగా ఒంగోలులోని రిమ్స్‌లో వైద్యం పొందుతోంది. పుస్తకాల బ్యాగు మోయాల్సిన వయసులో ఆ బాలిక కడుపులో బిడ్డను మోయాల్సిన పరిస్థితి వచ్చిందని బాలిక బంధువులు ఆవేదన చెందుతున్నారు. బాలిక అదృశ్యమైన సమయంలో అప్పటి పోలీసు అధికారుల చుట్టూ ఎన్ని పర్యాయాలు తిరిగినా పట్టించుకోలేదు. చివరకు జిల్లా ఎస్పీని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సిద్దార్థకౌశల్‌ ఆదేశాల మేరకు స్థానిక సీఐ సుధాకర్‌రావు, ఎస్సై సమందర్‌వలి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు సికింద్రాబాద్‌లో ఉన్న మైనర్‌ బాలికను, ఆమెను తీసుకెళ్లిన యువకున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అప్పటికే బాలిక గర్భవతి అయ్యింది. దీంతో ఫోక్సో చట్టం కింద వీరయ్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top