విరుచుకుపడిన మృగాళ్లు

Teacher On Rape Attempt In Anantapur - Sakshi

అమ్మ.. అక్క.. చెల్లి.. భార్య.. కుమార్తెగామగాడి జీవితంలో తోడూనీడగా నిలిచే ఈ బంధం నిత్య నరకాన్ని చవిచూస్తోంది.ఎక్కడ మాటు వేస్తారో తెలియదు.. ఎలా ఉచ్చు పన్నుతారో తెలియదు.. ఏ మాట వెనుక ఎలాంటి కుట్ర దాగుందో తెలియదు.. నమ్మడమే పాపమవుతోంది. జీవితాలను కూల్చేస్తోంది. ఏ బంధాన్ని నమ్మాలి.. ఎవరి అడుగులో అడుగులేయాలి.. ఏ చేయి పట్టుకుని నడవాలి.. నీడ కూడా కాటేస్తున్న రోజుల్లో.. పుట్టుకే నవ్వుల పాలవుతోంది. వయస్సుతో సంబంధం లేదు.. వావి వరుసలు లేవు.. ఇంటా.. బయట.. కామాంధుల వికృత చేష్టలతో ‘ఆమె’ ఉనికికోల్పోతోంది. కట్టుకున్నోడూ కాటేస్తున్నాడు.. తండ్రి ముసుగులో కీచకుడు బయటకొస్తున్నాడు.. గురువుల్లోనూ ఓ మృగాడు.. తోడుగా నిలిచే అన్న కూడా ఏదో కోరుకుంటున్నాడు.ఎవరికి చెప్పుకోవాలి.. ఏమని అడగాలి.. కన్నీళ్లకు కరగని మనసులివి.. కాళ్లావేళ్లా పడినా కనికరించని రోజులివి. అవును.. ఆడ పుట్టుక శాపమవుతోంది. 

పెద్దపప్పూరు (అనంతపురం): స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాఠశాలలో వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయురాలిపై మద్యం మత్తులోని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్పల గ్రామానికి చెందిన యువతి మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. రోజూ నార్పల నుంచి బస్సులో పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్లే సమయంలో నార్పలకు చెందిన వ్యక్తి తారసపడటంతో ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని చెట్లపొదల్లోకి బహిర్భూమికి వెళ్లగా అక్కడ మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు.

గట్టిగా కేకలు వేయడంతో ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి రక్షించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఉపాధ్యాయురాలి ముఖం మీద పిడిగుద్దులు కురిపిస్తూ.. కర్రతో కాళ్లు, వీపుపై కొట్టి హింసించారు. రక్షించే ప్రయత్నం చేసిన వ్యక్తితో పాటు ఆమె వద్దనున్న సెల్‌ఫోను, రూ.9వేల నగదును లాక్కున్నారు. అంతటితో వదిలేయాలని ప్రాధేయపడినా వారికి కనికరం లేకపోయింది. సుమారు 2 గంటల పాటు తీవ్రంగా హింసించారు.

ఒప్పిస్తానని నమ్మబలికి..
ఉపాధ్యాయురాలితో పాటు ఉన్న వ్యక్తి ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికి పక్కకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఉపాధ్యాయురాలికి ధైర్యం చెప్పి.. తాను వారిని అడ్డుకుంటానని, అక్కడి నుంచి పరుగెత్తిపోవాలని చెప్పాడు. ఆ వెంటనే ఆమె తాడిపత్రి–అనంతపురం ప్రధాన రహదారి వైపు పరుగు తీయగా.. ఆ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి దుండగులపై రాళ్లతో దాడి చేస్తూ ఆమెకు రక్షణగా అనుసరించాడు. అటుగా వస్తున్న లారీని ఆపి ఇద్దరూ ముచ్చుకోట గ్రామానికి చేరుకున్నారు.

జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసి వారి సహాయంతో తిరిగి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడే వదిలేసిన ద్విచక్ర వాహనం తీసుకొని గ్రామానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న నార్పల గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయురాలు పని చేస్తున్న మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబం జంకుతోంది. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దండగులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top