అన్నం అడిగారని దండన

Teacher Beats Boy In Medak - Sakshi

విద్యార్థులను చితకబాదిన వ్యాయామ ఉపాధ్యాయుడు

విద్యాలయం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

ప్రిన్సిపాల్, పీఈటీపై చర్యలు తీసుకోవాలని సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

చిన్నగుండవెళ్లి శివారులోని ‘గురుకుల’ పాఠశాలలో ఘటన

సిద్దిపేటరూరల్‌ : మధ్యాహ్న భోజనంలో మరోసారి అన్నం పెట్టమన్నందుకు ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిన్నగుండవెళ్లి శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జరిగింది. ఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. చిన్నగుండవెళ్లి శివారులో గల ఎల్లంకి కళాశాలలో మహాత్మా జ్యోతిబాపూలే(నారాయణరావుపేట) బాలుర గురుకుల విద్యాలయం కొనసాగుతోంది.

మంగళవారం మధ్యాహ్న భోజనం సమయంలో మరోసారి అన్నం పెట్టాలని అడిగిన 6, 8 తరగతులకు చెందిన విద్యార్థులు రాజేశ్, సుగీర్తి, మంజునాథ్‌ను ప్రిన్సిపాల్‌ రాజమణి ముందే పీఈటీ వెంకటేశ్‌ వితకబాదాడు. పైపుతో కొట్టడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు, సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ రాజమణి, పీఈటీ వెంకటేశ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సమాచారం అందుకున్న జిల్లా అసిస్టెంట్‌ బీసీ సంక్షేమాధికారి ఇందిర పాఠశాలకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, తల్లితండ్రులు తమ పిల్లలను చూడడానికి వచ్చిన ప్రతిసారి ప్రిన్సిపాల్‌ రాజమణి దూషించేదని తెలిసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్, పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా అసిస్టెంట్‌ బీసీ సంక్షేమాధికారి ఇందిరకు వినతిపత్రం ఇచ్చారు.

కమిలిపోయేలా కొట్టారు..

పాఠశాల పేరెంట్స్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా. నా ఇద్దరు కుమారులు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. గతంలో పిల్లలను చూడటానికి వచ్చినప్పుడు కూడా మేడం మాతో అమర్యాదగా మాట్లాడేది. స్వాతంత్ర దినోత్సవం కావడంతో పిల్లలకు వస్తువులు ఇవ్వడానికి వచ్చా. కొద్ది సేపటికే రాజశ్, సుగీర్తి ఏడుచుకుంటూ నా దగ్గరకు వచ్చారు. కారణం లేకుండా పీఈటీ కొట్టారని చెప్పారు.    – అంజయ్య, బైరాన్‌పల్లి

రావాలని చెప్పి..

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పేరెంట్స్‌ కమిటీని రావాలని ప్రిన్సిపాల్‌ రాజమణి చెప్పారు. నేను పేరెంట్స్‌ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నా. నా కొడుకు మంజునాథ్‌ ఏడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి.. తనకు తగిలిన దెబ్బలు చూపించాడు. దీనిపై ప్రిన్సిపాల్‌ను అడగగా.. తాను మహిళా ప్రిన్సిపాల్‌ని అని, అనవసరంగా రాద్దాంతం చేస్తే కేసులు పెడతానని బెదిరించింది.           – బాల్‌రాజు, నందారం

చర్యలు తీసుకుంటాం..

పాఠశాలలో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ముందుగా నివేదికలు ఉన్నతాధికారులకు పంపిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. 

– ఇందిరా, అసిస్టెంట్, బీసీ సంక్షేమాధికారి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top