గ్రామ వాలంటీర్లపై టీడీపీ వర్గీయుల దాడి

TDP Activists Attack On Grama Volunteer At Srikakulam - Sakshi

కాగితాపల్లిలో ఘటన

ఐదుగురు టీడీపీ నేతలపై కేసు

దాడికి పాల్పడిన వారిలో డీసీసీబీ ఉపాధ్యక్షుడి సోదరుడు

సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్‌ కిమిడి గౌరునాయుడు మంగళవారం రేషన్‌ సరుకులు తీసుకున్న ప్రతి లబ్ధిదారుని వేలిముద్రను తీసుకొని బియ్యానికి సంబంధించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. విధుల్లో భాగంగా ఉద యం 7.30 గంటల సమయంలో దూబ నాగమణికి సంబంధించిన ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లకు వేలిముద్రలు వేయించేందుకు వెళ్లారు. ఇంతలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు దూబ ధర్మారావు సోదరుడు దూబ అప్పలనాయుడుతోపాటు దూబ పాపారావు, కిమిడి నీలకంఠం, కిమిడి రమేష్, దూబ సూరపునాయుడులు వచ్చి దుర్భాషలాడుతూ దాడికిపాల్పడ్డారని గౌరునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మా ఇంటికి వచ్చి వేలిముద్ర వేయించుకోవడానికి నీవేవరవు, నువ్వు మా వలంటీర్‌ కాదని దూబ అప్పలనాయుడు హుకుం జారీ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు సూచించిన ఆదేశాలతోనే తాను విధులు నిర్వహిస్తున్నానని, విధుల్లో భాగంగానే మీ ఇంటికి వెళ్లి వేలిముద్రలను తీసుకోవడంలో తన తప్పేమీలేదని గౌరునాయుడు అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన దూబ అప్పలనాయుడుతోపాటు మిగిలిన వారు కూడా తనపై దాడి చేశారన్నారు. విషయం తెలుసుకున్న గౌరునాయుడు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని నిలువరించే ప్రయత్నం చేయగా వారిని కూడా దుర్భాషలాడుతూ అంతుచూస్తామని బెదింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

గాయపడిన గౌరునాయుడును కుటుంబ సభ్యులు బైక్‌పై రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.రేవతి, ఏఎస్‌ఐ వి.శ్రీనివాసరావు, సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడు వద్ద నుంచి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామంలోకి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి గౌరునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ.. 
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, మజ్జి శ్రీనివాసరావు, టంకాల ఉమాపాపినాయుడు తదితరులు రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడును పరామర్శించారు. అధైర్యపడొద్దని, నీ వెంట తామంతా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే ఆరా.. 
కాగితాపల్లి గ్రామ వలంటీర్‌ కిమిడి గౌరునాయుడుపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు దూబ ధర్మారావు సోదరుడుతోపాటు అనుయాయులు దాడిచేసిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరా తీశారు. దాడి ఘటన హేయమైన చర్యని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top