పసి ప్రాణాన్ని బలిగొన్న ‘బాతు’!

Suspicious death of a tribal boy in Chittoor district - Sakshi

ఓ బాతు కోసం ఇద్దరు చిన్నారుల మధ్య వివాదం

ఈ క్రమంలో ఇంట్లోంచి వెళ్లిపోయి విగతజీవిగా మారిన బాలుడు

బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ఓ బాతుకు సంబంధించిన వివాదంలో గిరిజన బాలుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పార్లపల్లి ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రూప, రమేష్‌ దంపతులకు వెంకటరమణ (11), రమేష్‌ (8) ఇద్దరు కుమారులు. భర్త రమేష్‌ ఏడేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో రూప కూలి పనులు చేసుకుంటూ కుమారులను చదివించుకుంటోంది. వెంకటరమణ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం వెంకటరమణ తల్లితో కలిసి పొలాల వద్ద వేరుశనగకాయల కొట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తల్లితో కలిసి పనిచేశాడు.

ఆ తర్వాత ఇంటికొస్తూ పంట కాలువలో చేపలు పట్టి పక్కనే బాతులు మేపుతున్న వారికి ఇచ్చి వారి నుంచి ఓ బాతు తీసుకుని ఇంటికొస్తున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన మురగారెడ్డి కుమారుడు ధనుష్‌ ఆ బాతు తనకు కావాలని బలవంతంగా లాక్కెళ్లాడు. తర్వాత ధనుష్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటరమణ వెళ్లి బాతును తెచ్చుకున్నాడు. ఇది తెలుసుకున్న ధనుష్‌.. తల్లితో కలిసి వెంకటరమణ ఇంటికెళ్లి గొడవచేసి బాతును తిరిగి తెచ్చుకున్నారు.

ఈ క్రమంలో సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన వెంకటరమణ రాత్రంతా ఇంటికి రాలేదు. బంధువులు వెతికినా ఫలితం లేదు. అయితే ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో వెంకటరమణ శవమై కనిపించాడు. బాతుకోసం తన బిడ్డను ధనుష్‌ చంపేశాడని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. ధనుష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top