సిటీ పేలుళ్లలో ఐఎం ఉగ్రవాది హస్తం? | Suspicions about the role of Thuakhir | Sakshi
Sakshi News home page

తౌఖీర్‌ పాత్రపై అనుమానాలు

Jan 25 2018 3:20 AM | Updated on Jan 25 2018 4:44 AM

Suspicions about the role of Thuakhir - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రసంస్థ నగరంలో 2007, 2013ల్లో పాల్పడిన జంట పేలుళ్ల కేసులో ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్‌ సుభాన్‌ ఖురేషీ అలియాస్‌ తౌఖీర్‌ పాత్రపై రాష్ట్ర నిఘా విభాగం లోతుగా ఆరా తీస్తోంది. దశాబ్దకాలంగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారులు అక్కడి ఘాజీపురలో శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో అతడిని విచారించేందుకు రాష్ట్రంలోని నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. 

సిమిలో ఉండగా సిటీకి
మధ్యప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన తౌఖీర్‌ కంప్యూటర్‌ కోర్సు కోసం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) ఆలిండియా చీఫ్‌ సఫ్దర్‌ నఘోరీ పరిచయంతో ఓ సంస్థలో ఉన్నతోద్యోగానికి 2001లో రాజీనామా చేశాడు. సిమి వెలువరిస్తున్న ‘ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌’ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే నఘోరీతో కలసి హైదరాబాద్‌ వచ్చి సిమి సానుభూతిపరుల్ని కలిశాడు. వీరికి గుజరాత్‌ అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలతో కూడిన వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ను ఓ వ్యక్తి ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒక్క ‘పర్యటనే’రికార్డుల్లోకి ఎక్కినప్పటికీ వీరు పలుమార్లు నగరానికి వచ్చినట్లు అనుమానాలున్నాయి.

ఐఎం ఏర్పాటులో కీలకంగా
బండ్లగూడలోని ఓ విద్యాసంస్థలో పని చేసి, అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో అరెస్టయిన ముఫ్తీ అబు బషర్‌ను తౌఖీర్‌ కలసినట్లు అనుమానిస్తున్నాయి. 2001 సెప్టెంబర్‌లో కేంద్రం సిమిపై నిషేధం విధించడంతో అతడితోపాటు మరికొందరు అప్పట్లో ముంబైలో ఉంటున్న రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌లను కలసి ఐఎంను స్థాపించారు. బాంబుల తయారీలో నిష్ణాతుడిగా పేరున్న తౌఖీర్‌ పేరు అహ్మదాబాద్, ముంబై పేలుళ్లలో నేరుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి పరారీలో ఉన్న అతడు కొన్నాళ్ల పాటు పాక్, దుబాయ్‌ల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఆ రెండు పేలుళ్ల వెనుక
ఐఎం గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ (2007), దిల్‌సుఖ్‌నగర్‌ (2013)లో జంట పేలుళ్లకు పాల్పడింది. ఈ రెండు కేసుల్లోనూ రియాజ్‌ భత్కల్, ఒకదాంట్లో ఇక్బాల్‌ భత్కల్, అమీర్‌ రజా ఖాన్‌ నిందితులుగా ఉన్నారు. వీటికి సంబంధించిన సమావేశాల్లో భత్కల్‌ సోదరులతో పాటు తౌఖీర్‌ కూడా పాల్గొని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది రూఢీ అయితే నగరంలోని జంటపేలుళ్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో ఇతడు వాంటెడ్‌గా మారతాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement