నేరస్తుల ముఠా అరెస్ట్‌

Supari Gang Arrest - Sakshi

ఆరుగురి సభ్యుల రిమాండ్‌

రెండు తుపాకులు,నాలుగు బుల్లెట్లు స్వాధీనం

అత్తాపూర్‌: హైదరాబాద్‌ పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో సుపారీలు తీసుకొని హత్యలు, చోరీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ఆరుగురి నుంచి రెండు దేశీవాలి తుపాకులు, నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని గురుద్వార్‌లో పూజారిగా పని చేస్తున్న సర్దార్‌ జితేందర్‌సింగ్‌ (42), చాంద్రయణగుట్ట అషామాబాద్‌కు చెందిన మహమ్మద్‌ జబ్బార్‌ (33), మహ్మద్‌ సయ్యద్‌ (34), శాస్త్రీపురానికి చెందిన అబ్దుల్‌ అజార్‌ (22), ఉప్పర్‌పల్లి ఫోర్ట్‌ వ్యూ కాలనీకి చెందిన షేక్‌ వాహెద్‌ (25), మౌలాలి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇబ్రహం (45) ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్‌లలో హత్య, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

రూ.10 లక్షల సుపారి తీసుకోని 2016లో మౌలాలి ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణను హత్య చేశారు. ఆ కేసులో అరెస్ట్‌ అయినప్పడు ఒక దేశీవాలి పిస్టల్‌ను పోలీసులకు అప్పగించారు. మిగతా రెండు పోలీసులకు ఇవ్వకుండా గుర్తు తెలియని ప్రాంతంలో దాచిపెట్టారు. బెయిల్‌ నుంచి వచ్చిన అనంతరం రెండు తుపాకులను పట్టుకొని నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజులుగా రాజేంద్రనగర్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఒకరి హత్యకు సుపారీ తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఈ ముఠాపై నిఘా పెట్టారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలో ఆదివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేందర్‌సింగ్, జెబ్బార్, అజార్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుంచి ఒక దేశివాలి పిస్టల్‌ రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురి సమాచారం తీసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి  ఒక దేశివాలి పిస్టల్, రెండు లైవ్‌ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరుగురితో కూడిన ముఠా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ దయానంద్‌రెడ్డి, శంషాబాద్‌ ఎస్‌ఓటీ టీం, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్, రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top