
దుర్రు ప్రియ బాంధవి (ఫైల్) , కన్నీరు మున్నీరవుతున్న తల్లి నాగమణి, బంధువులు
ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
పశ్చిమగోదావరి, నిడదవోలు: నిడదవోలు పాటిమీద సెంటర్‌లోని పోస్టాఫీసు వీధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. పోస్టాఫీసు వీధిలో దుర్రు నాగమణి అనే మహిళ భర్త నాగరాజు మృతిచెందడంతో ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త నాగరాజు ద్వారా ఆమె ప్రియబాంధవి అనే అమ్మాయికి జన్మనిచ్చింది. నాగమణి అప్పలరాజు, ప్రియబాంధవితో కలిసి పోస్టాఫీసు వీధిలో నివాసముంటోంది. ప్రస్తుతం ప్రియభాందవి (20) తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో ఇటీవల అప్పలరాజు, నాగమణి తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ప్రియబాంధవికి నీరసంగా ఉండటంతో కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. మళ్లీ భార్యభర్తలు గొడవపడటంతో పాటు అప్పలరాజు ప్రియబాంధవిని తిట్టాడు. దీంతో తల్లి నాగమణి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.
మనస్తాపం చెందిన ప్రియబాంధవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. అరగంట తర్వాత ప్రియబాంధవి ఆత్మహత్య చేసుకుందని అప్పలరాజు భార్య నాగమణికి సమాచారం ఇచ్చాడు. లబోదిబోమంటూ ఇంటికి చేరుకున్న నాగమణి ఇంట్లోని గదిలోకి వెళ్లి చూడగా ప్రియబాంధవి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె పిరికి కాదని, భర్త అప్పలరాజు వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని నాగమణి రోదించింది. అప్పలరాజు గతంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కు మార్తె చనిపోయినా సంఘటన స్థలానికి రాకపోవడంతో అతనిపై పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణ ఎస్సై జి.సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.