చేతబడి అనుమానంతో..తండ్రిని చంపిన తనయులు

Sons Killed His Father - Sakshi

రాయగడ: రాయగడ జిల్లా ఆదివాసీ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడి గిరిజనులు అడవులపై ఆధారపడి జీవిస్తారు. ఇక్కడి వారికి దెయ్యం, భూతం, చేతబడి అంటే మహాభయం. దీనిపై అనుమానం వచ్చినవారిని అనేక గ్రామాలలోని ప్రజలు హత్యలు చేస్తున్నారు. జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

చేతబడి ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ, నిరక్ష్యరాస్యులు కావడంతో ఆదివాసీ ప్రజలకు వీటిపై నమ్మకం ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పనసపొదరొ గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో కన్నతండ్రిని ఇద్దరు కొడుకులు కొట్టి చంపి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఈ ఘటన జరిగింది.

పనసపొదరొ గ్రామానికి చెందిన భరత్‌ కుంబొరొ(60)అనే వృద్ధుడు  చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో అతని కుమారులు అంతులు కుంబొరొ, మంగులు కుంబొరొలు కలిసి 13వ తేదీ సాయంత్ర తండ్రిని చితకబాది గ్రామ పొలిమేరలోకి తీసుకువెళ్లి చంపి, అర్ధరాత్రి 2గంటల సమయంలో వాగు ఒడ్డున పాతిట్టారు.

ఈ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే నిన్ను కూడా హత్య చేస్తామని భరత్‌ కుంబరొ భార్య మాగొ కుంబొరొకు అన్నదమ్ములిద్దరూ బెదిరించడంతో  ఈ విషయం బయటకు రాలేదు. ఈ విషయం ఆనోట ఈ నోట ఈ నెల 21వ తేదీన సాయంత్రం టికిరి పోలీసులకు సమాచారం అందడంతో గ్రామానికి వచ్చి నిందితులు అంతులు కుంబొరొ, మంగులు కుంబొరొలను అరెస్ట్‌ చేశారు.

అనంతరం వారిని విచారణ చేయగా జరిగిన హత్యోదంతమంతా చెప్పడంతో శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లి పాతిపెట్టిన శవాన్ని పోలీసులు బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. చేతబడిని నమ్మవద్దని ప్రభుత్వం లక్షలాది రూపాయల ఖర్చు చేసి, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఆదివాసీ సంఘాలతో ప్రతి గ్రామంలో భారీ ప్రచారం చేస్తున్నా చేతబడి నెపంతో హత్యలు చేయడం మాత్రం ఆగడంలేదు. 

హత్యలు చేసి దోషులుగా మారవద్దని ప్రజలను చైతన్యవంతులు చేసినప్పటికీ ఈ ఘటనలు తగ్గడం లేదు. ప్రజల్లో మూఢనమ్మకాలు పెరగడంతో నేటికీ సాధారణ జ్వరం వచ్చినా చేతబడిగా అనుమానించి చేతబడి పూజలు చేస్తున్నారు. ఇలా చేయడంతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top