కన్నతల్లి దారుణంగా కొట్టి చంపాడు.!

Son Kills Mother in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(అమీర్‌పేట): కన్నతల్లినే కొట్టి చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడ కేవీఆర్‌ ఎన్‌క్లీవ్‌ అపార్ట్‌మెంట్‌లో గుంటి శ్రీనివాస్‌ యాదవ్‌, మమత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్‌ ఇంటి అద్దెలు వసూలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మమత చిట్టీల వ్యాపారం చేసేది. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలైంది. చిట్టీ కట్టిన వారు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తుండటంతో గతంలో ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. 

ఈ విషయమై మాధన్‌ తల్లితో తరచూ గొడవ పడుతుండేవాడు. దీంతో మనస్తాపం చెందిన మమత 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా కొత్తపేటలో ఉంటున్న తన సోదరుడు రమేష్‌ ఇంటికి వెళ్లింది. రమేష్‌ బుధవారం రాత్రి ఆమెను తీసుకువచ్చి ఎల్లారెడ్డిగూడలో వదిలి వెళ్లాడు. మమత వచ్చి రాగానే మాధన్, శ్రీనివాస్‌ ఆమెతో గొడవకు దిగారు. రాత్రి 11.30 సమయంలో మాధవ్‌ తల్లిని అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ పైకి లాక్కెళ్లి ఆమె తలపై కర్రతో మోది గొంతునులిమి హత్య చేశాడు. కిందకు వచ్చి అమ్మను చంపేశానని తండ్రి శ్రీనివాస్‌ యాదవ్‌కు తెలిపాడు.

తండ్రీ, కొడుకులు కలిసి చంపేశారు.!
భర్త శ్రీనివాస్, కుమారుడు మాధన్‌ కలిసి తన కుమార్తెను హత్య చేశారని మమత తండ్రి రాములు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారం పేరుతో మాధన్‌ తల్లి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని జల్సా చేశాడన్నారు. కొడుకు చేసిన అప్పులు తీర్చేందుకు ఆమె భర్తకు తెలియకుండా తన బంగారు నగలు తాకట్టు పెట్టిందన్నారు. నగల విషయమై భర్త శ్రీనివాస్‌ యాదవ్‌ పదే పదే అడగ్గా దాచిపెట్టానని చెప్పిందని తెలిపారు. భర్తకు అబద్దాలు చెప్పడం ఇష్టం లేక ఆమె కొత్తపేటలో ఉంటున్న అన్న ఇంటికి వెళ్లిందన్నారు. కుమారుడికి ఫోన్‌ చేసి డబ్బులు తెచ్చి ఇవ్వాలని లేకపోతే ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించడంతో మాధన్‌ ఆమెను పథకం ప్రకారం టెర్రస్‌ పైకి తీసుకువెళ్లి హత్య చేశాడని ఆయన ఆరోపించాడు. భర్త, కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top